మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
క్రీడలపై దృష్టి సారించాలి
అదనపు ఎస్పీ చిత్తరంజన్
జైనూర్,(విజయక్రాంతి): యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ క్రీడలపై దృష్టి సారించాలని అదనపు ఎస్పీ చిత్తరంజన్(Additional SP Chittaranjan) సూచించారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ‘చైతన్యం – డ్రగ్స్పై యుద్ధం’ కార్యక్రమంలో భాగంగా జైనూర్లో నిర్వహించిన సబ్ డివిజన్ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్(Volleyball tournament) ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. మూడు రోజులపాటు జరిగిన ఈ టోర్నీలో జైనూర్, సిర్పూర్ (యు), లింగాపూర్, కెరమెరి మండలాల నుంచి 65 జట్లు పాల్గొన్నాయి. పోటీల్లో దేవుగూడ జట్టు ప్రథమ, రాసిమెట్ట జట్టు ద్వితీయ, శివనూరు జట్టు తృతీయ స్థానాలు సాధించాయి.
ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ గంజాయి, గుట్కా, ఇతర మాదకద్రవ్యాల వినియోగం ఆరోగ్యంతోపాటు కుటుంబాలు, సమాజంపై తీవ్ర ప్రభావం చూపుతుందని తెలిపారు. క్రీడలు క్రమశిక్షణ, ఐకమత్యం, నాయకత్వ లక్షణాలను పెంపొందిస్తాయని పేర్కొన్నారు. మత్తు పదార్థాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేస్తూ, ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జైనూర్ ఎస్సై రవికుమార్, పోలీస్ సిబ్బంది, ప్రజాప్రతినిధులు, సర్పంచులు, సార్మెడీలు, క్రీడాకారులు, యువత, గ్రామస్థులు పాల్గొన్నారు.