రికార్డుల నిర్వహణలో ఖచ్చితత్వం పాటించాలి
పోలీస్ కార్యాలయాన్ని తనిఖీ చేసిన డీఐజీ అంబర్ కిషోర్ ఝా
ఆసిఫాబాద్,(విజయక్రాంతి): వార్షిక తనిఖీల్లో భాగంగా కాళేశ్వరం మల్టీజోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా(DIG Amber Kishore Jha) గురువారం కుమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా(Kumuram Bheem Asifabad District) పోలీస్ కార్యాలయాన్ని సందర్శించారు. జిల్లా ఎస్పీ నితికా పంత్ ఆయనకు స్వాగతం పలకగా, పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు.అనంతరం డీసీఆర్బీ, ఏ, బీ సెక్షన్లు, ఫింగర్ప్రింట్, డీ4సీ, కమాండ్ కంట్రోల్ విభాగాలను తనిఖీ చేసి రికార్డులు, కేసుల వివరాలు, పెండింగ్ కేసుల ఫైళ్ల నిర్వహణను పరిశీలించారు.
రికార్డులను క్రమబద్ధంగా నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు నవీకరించాలని, ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ శాఖ సమర్థవంతమైన పనితీరుకు ఖచ్చితమైన రికార్డుల నిర్వహణ కీలకమని పేర్కొన్నారు.అనంతరం ఉచిత పోలీస్ నియామక శిక్షణ పొందుతున్న 160 మంది అభ్యర్థులతో మాట్లాడి, శిక్షణ వివరాలను తెలుసుకున్నారు. పోటీ పరీక్షలకు క్రమశిక్షణతో సిద్ధమై ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నితికా పంత్, అదనపు ఎస్పీ చిత్తరంజన్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్, రిజర్వ్ ఇన్స్పెక్టర్ (అడ్మిన్), డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు.