ఇండియన్ గ్లోరీ అవార్డు గ్రహీత సిద్దెల హుస్సేన్‌కు ఘన సన్మానం
- బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న చేతుల మీదుగా సత్కారం
- కళా ప్రదర్శనలతో ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న ప్రజా కళాకారుడు
- తెలంగాణ ఉద్యమంలోనూ ధూంధాం కార్యక్రమాలతో కీలక పాత్ర
మణుగూరు, నవంబర్ 4 (విజయక్రాంతి): కళారత్న మూవీస్ సంస్థ(Kalaratna Movies banner) ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో ఇటీవల ప్రతిష్ఠాత్మకమైన ఇండియన్ గ్లోరీ అవార్డు అందుకున్న ప్రజా కళాకారుడు, బీటీపీఎస్ ఉద్యోగి సిద్దెల హుస్సేన్‌ను బీటీపీఎస్ చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న ఘనంగా సన్మానించారు. బుధవారం మణుగూరులోని బీటీపీఎస్‌లో ఈ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా చీఫ్ ఇంజనీర్ బిచ్చన్న మాట్లాడుతూ.. సిద్దెల హుస్సేన్ తన కళా ప్రదర్శనల ద్వారా ప్రజల్లో చైతన్యం తీసుకురావడం అభినందనీయమన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ధూంధాం కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారని గుర్తుచేశారు. సిద్దెల హుస్సేన్ వంటి ప్రతిభావంతుడైన కళాకారుడు బీటీపీఎస్‌లో ఉద్యోగిగా పనిచేయడం సంస్థకు గర్వకారణమని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని అవార్డులు, రివార్డులు అందుకోవాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో డిప్యూటీ కంట్రోలర్ ఆఫ్ అకౌంట్స్ శ్రీనివాస్, డివిజనల్ ఇంజనీర్లు మహేందర్, చక్రధర్, ఏడీఈ సత్యనారాయణమూర్తి, అసిస్టెంట్ ఇంజనీర్ శ్రీకాంత్, కార్మిక సంఘం-1535 రీజినల్ అధ్యక్షుడు వి.ప్రసాద్, ప్రధాన కార్యదర్శి ఆర్.రామచందర్, నాయకులు రమణ తదితరులు పాల్గొన్నారు.