అర్హులైన రైతులకు బ్యాంకర్లు అండగా నిలబడాలి

04-11-2026 | 08:55pm

- జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్, నవంబరు 4 (విజయక్రాంతి): ఎల్ నినో ప్రభావంతో జిల్లాలో కరువు పరిస్థితులు నెలకొన్నందున అర్హులైన రైతులకు బ్యాంకర్లు అండగా నిలవాలని కలెక్టర్ చిత్రా మిశ్రా(Collector Chitra Mishra) బ్యాంక్ అధికారులను ఆదేశించారు. బుధవారం జిల్లాకేంద్రంలోని ఐడీఓసీలో బ్యాంకర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..కరువు వేళ సిబ్బంది మానవతా దృక్పథంతో వ్యవహరించి పంట రుణాల పునర్వ్యవస్థీకరణ ద్వారా రైతులకు ఆర్థిక ఉపశమనం కల్పించాలని కోరారు.   

జిల్లాలోని కరీంనగర్ అర్బన్, కరీంనగర్ రూరల్, హుజురాబాద్ మండలాలను ప్రభుత్వం  కరువు మండలాలుగా గుర్తించిందన్నారు. పాక్షిక కరువు మండలాల్లో 36 నెలల వరకు రుణాలను మధ్యకాలిక రుణాలుగా మార్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కరువు పరిస్థితుల కారణంగా రైతుల ఆర్థిక ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బ్యాంకర్లు బలవంతపు రుణ వసూళ్లకు పాల్పడవద్దని స్పష్టం చేశారు. అర్హులైన రైతులకు కొత్త రుణాలు అందించి వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాలకు అవసరమైన ఆర్థిక సహకారం అందించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా అర్హులైన స్వయం సహాయక సంఘాల సభ్యులకు బ్యాంకు లింకేజీ రుణాలు అందించాలని కలెక్టర్ ఆదేశించారు. 

ఉద్యాన శాఖ, మత్స్యశాఖ, పశుసంవర్ధక శాఖ ల ద్వారా ప్రభుత్వం మంజూరు చేసే రుణాలను అర్హులకు బ్యాంకు సిబ్బంది అందించేలా చర్యలు చేపట్టాలన్నారు జిల్లాలోని ప్రతి పౌరుడికి బ్యాంకింగ్, బీమా, పింఛను సదుపాయాలు అందించడమే లక్ష్యంగా జరుగుతున్న ఆర్థిక సమ్మిళిత సంతృప్త ప్రచారంలో ప్రజలు పాల్గొనాలని కలెక్టర్ కోరారు.  బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ, ఈ కేవైసీ , బ్యాంకుల అందించే బీమా పథకాలు, ఇతర రుణాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు షర్మిల, జల కుమారి, ఎల్ డీఎం ఉమా శంకర్, ఆర్ బీఐ ఏజీఎం చిరంజీవి, నాబార్డ్ డీడీఎం జయప్రకాష్, తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు