నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదం : సీఐ చెన్నూరి శ్రీనివాస్

15-10-2026 | 11:12pm

సీసీ కెమెరాల ఆధారంగా 24 గంటల్లోనే రూ.30 వేల నగదు గుర్తింపు

బాధితుడికి అందజేసిన సీఐ 

భూపాలపల్లి టౌన్,(విజయక్రాంతి): నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు దోహదపడుతాయని భూపాలపల్లి సీఐ చెన్నూరి శ్రీనివాస్(Bhupalpally CI Chennuri Srinivas) అన్నారు. భూపాలపల్లి జిల్లా బస్టాండ్ సమీపంలో పోగొట్టుకున్న రూ.30,000 నగదును భూపాలపల్లి పోలీసులు(Bhupalpally Police) సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా 24 గంటల్లోనే గుర్తించి బాధితుడికి తిరిగి అందజేశారు. 

వివరాల్లోకి వెళ్లితే.. నాచారం గ్రామానికి చెందిన మేకల రాజు ఆటోలో ప్రయాణించి దిగుతున్న సమయంలో నగదు ఉన్న బ్యాగు కిందపడిపోయింది. అదే మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న మరో వ్యక్తి ఆ బ్యాగును తీసుకువెళ్లాడు. దీంతో బాధితుడు భూపాలపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించి బ్యాగును తీసుకెళ్లిన వ్యక్తిని గుర్తించారు.

అనంతరం నగదును స్వాధీనం చేసుకుని భూపాలపల్లి సీఐ శ్రీనివాస్ చేతుల మీదుగా బాధితుడు మేకల రాజుకు తిరిగి అందజేశారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ సీసీ కెమెరాలు నేరాల నియంత్రణతో పాటు పోగొట్టుకున్న వస్తువులు, నగదును గుర్తించడంలో ఎంతగానో ఉపయోగపడతాయని తెలిపారు. ప్రజలు తమ ఇళ్లు, వ్యాపార సముదాయాలు, ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

మరిన్ని వార్తలు