కమ్యూనిటీ సీసీ కెమెరాల ప్రారంభోత్సవం

15-10-2026 | 11:32pm

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్(Karimnagar Police Commissionerate) పరిధిలోని  27వ డివిజన్ అంబేద్కర్ నగర్‌లో శివాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కమ్యూనిటీ సీసీ కెమెరాలను త్రీ టౌన్ ఇన్స్పెక్టర్ తిరుమల్(Three Town Inspector Thirumal) ప్రారంభించారు. ఈ సందర్భంగా ఇన్‌స్పెక్టర్ మాట్లాడుతూ... ప్రజల భద్రతను మరింత బలోపేతం చేయడం, నేరాలను నియంత్రించడం, నేరాలకు పాల్పడిన వారిని త్వరగా గుర్తించడం కోసం సీసీ కెమెరాలు దోహదపడతాయన్నారు.

శాంతిభద్రతలను పరిరక్షించడం లక్ష్యంగా కమ్యూనిటీ సీసీ కెమెరాల(Community CCTV Cameras)ను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని తెలిపారు. ప్రతి కాలనీ, ప్రతి డివిజన్‌లోని ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని, పోలీసులకు సహకరించాలని కోరారు.ప్రజల భాగస్వామ్యంతోనే నేరరహిత సమాజాన్ని నిర్మించగలమని, ప్రతి ఒక్కరూ తమ పరిసర ప్రాంతాల భద్రత పట్ల బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.

కమ్యూనిటీ సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలకు, శివాజీ నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులకు  స్థానిక ప్రజలకు పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో  త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జి. తిరుమల్  27వ డివిజన్ కార్పొరేటర్ బోట్ల శ్యామల , తంగేళ్ల కిరణ్ కుమార్,  వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు