డీజే ట్రాలీలో పేలిన టపాసులు.. నలుగురికి గాయాలు
టేకులపల్లి, (విజయక్రాంతి): టేకులపల్లి మండలం బేతంపూడి గ్రామ పంచాయతీ(Bethampudi Gram Panchayat) పరిధిలోని వెంకట్యతండాలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళ అంతిమయాత్రలో ఏర్పాటు చేసిన డీజే ట్రాలీ క్యాబిన్లో టపాసులు పేలడంతో నలుగురు గాయపడ్డారు. వీరిలో భూక్య రానా, ఆంగోతు ధ్రువన్ తీవ్రంగా గాయపడగా, ధరావత్ రవికుమార్తో పాటు మరో వ్యక్తికి గాయాలయ్యాయి.
డీజే ట్రాలీ క్యాబిన్లో టపాసులు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పేలుడు ధాటికి క్యాబిన్లో ఉన్నవారు గాయపడడంతో స్థానికులు వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. తొలుత టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స అందించగా, తీవ్రంగా గాయపడిన వారిని మెరుగైన వైద్యం కోసం ఖమ్మం ఆస్పత్రికి తరలించారు.
విషయం తెలుసుకున్న టేకులపల్లి ఎస్ఐ కోగిల తిరుపతి టేకులపల్లి రిమ్స్ ఆస్పత్రికి చేరుకుని క్షతగాత్రులను పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. అంతిమయాత్రలో టపాసులు పేలడంతో ఈ ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా తెలుస్తున్నప్పటికీ, ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.