నీటి యాజమాన్యంపై రైతులు అప్రమత్తంగా ఉండాలి

14-10-2026 | 05:10pm

పొట్ట దశ నుంచి కంకి దశ వరకు జాగ్రత్తలు తప్పనిసరి

చివ్వెంల, అక్టోబర్ 14 (విజయక్రాంతి): చివ్వెంల మండలం పాండ్యానాయక్ తండాలో వరి పంటలను కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం(Kampasagar Agricultural Research Station), తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం హుజూర్‌నగర్ శాస్త్రవేత్తలు, వ్యవసాయ శాఖ అధికారులు(Agriculture Department officials) బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. పంట ఎదుగుదల, నీటి లభ్యత, చీడపీడల ఉధృతిని పరిశీలించి రైతులకు పలు సూచనలు చేశారు.

ప్రస్తుతం వరి పంటలు పొట్ట దశ నుంచి కంకి దశలో ఉన్నాయని, ఈ దశలో సరైన నీటి యాజమాన్యం దిగుబడిపై ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం లోటు, సాగునీటి కొరత ఏర్పడే అవకాశాలను దృష్టిలో ఉంచుకొని అందుబాటులో ఉన్న నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించారు.

కాండం తొలిచే పురుగులు, ఆకుముడత పురుగు తదితర చీడపీడల లక్షణాలను ఎప్పటికప్పుడు గమనించాలని, నష్టం తీవ్రతను బట్టి వ్యవసాయ అధికారుల సూచనల మేరకు సిఫారసు చేసిన పురుగుమందులను సరైన మోతాదులో వినియోగించాలని తెలిపారు. విచక్షణారహితంగా మందులు పిచికారీ చేయడం వల్ల పంటకు నష్టం కలగడంతో పాటు సాగు ఖర్చులు పెరుగుతాయని పేర్కొన్నారు.

ఈ పర్యటనలో కంపాసాగర్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం వరి ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ కె. పరిమళ, శాస్త్రవేత్త కె. సంధ్యారాణి, హుజూర్‌నగర్ తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ కె. చంద్రశేఖర్, మండల వ్యవసాయ అధికారి డి. వెంకటేశ్వర్లు, వ్యవసాయ విస్తరణ అధికారులు బి. శైలజ, డి. మానస, రైతు ధరావత్ నందా తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు