భక్తిపారవశ్యంలో కుంతిదేవి పాండవుల ఉత్సవాలు
- 18 రోజుల పాటు వైభవంగా వేడుకలు.. ముగింపు రోజున నందికి ప్రత్యేక పూజలు
- మట్టి, నెయ్యితో నంది విగ్రహం తయారీ.. గ్రామ వీధుల్లో ఊరేగింపు
- గోదావరిలో సామూహిక పుణ్యస్నానాలు.. తరతరాల సంప్రదాయాలకు పెద్దపీట
బూర్గంపాడు,(విజయక్రాంతి): మండలంలోని మోరంపల్లి బంజర గ్రామం(Morampalli Banjara Village) అంబేద్కర్ కాలనీలో నిర్వహించిన కుంతిదేవి పాండవుల ఉత్సవాలు భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక సందడితో ముగిశాయి. 18రోజుల పాటు గ్రామస్థులంతా ఐక్యంగా నిర్వహించిన ఈ వేడుకలకు గురువారం సంప్రదాయబద్ధంగా ముగింపు పలికారు. చివరి రోజు నిర్వహించిన నంది విగ్రహ తయారీ, ప్రత్యేక పూజలు, గ్రామ వీధుల్లో ఊరేగింపు, గోదావరిలో సామూహిక పుణ్యస్నానాలు ఉత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
నందికి ప్రత్యేక పూజలు
ఉత్సవాల ముగింపు సందర్భంగా గ్రామస్థులు సంప్రదాయ ఆచారాల ప్రకారం మట్టి (బంగారం), నెయ్యితో నంది విగ్రహాన్ని తయారు చేశారు. అనంతరం విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించి, పూలతో అలంకరించారు. భక్తిశ్రద్ధలతో నందిని గ్రామంలోని ప్రధాన వీధుల గుండా ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో మహిళలు, యువకులు, పెద్దలు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజలు చేశారు. దీంతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
గోదావరిలో సామూహిక పుణ్యస్నానాలు
నంది విగ్రహం ఊరేగింపు అనంతరం గ్రామస్థులంతా గోదావరి నది వద్దకు చేరుకున్నారు. అక్కడ సామూహికంగా పవిత్ర స్నానాలు ఆచరించి, సంప్రదాయ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కుటుంబ సమేతంగా తరలివచ్చిన భక్తులతో గోదావరి పరిసరాలు సందడిగా మారాయి. కుంతిదేవి, పాండవులను స్మరించుకుంటూ భక్తులు ఉత్సవాల ముగింపు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
తరతరాలుగా కొనసాగుతున్న ఆచారం
మోరంపల్లి బంజర గ్రామంలో కుంతిదేవి పాండవుల ఉత్సవాలను 18 రోజుల పాటు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. పూర్వీకుల నుంచి కొనసాగుతున్న ఆచార వ్యవహారాలను నేటి తరానికి పరిచయం చేస్తూ గ్రామస్థులు రెండు సంవత్సరాలకు ఒకసారి ఈ వేడుకలను సామూహికంగా నిర్వహిస్తున్నారు.
కులమతాలకు అతీతంగా గ్రామంలోని ప్రజలంతా కలిసికట్టుగా ఉత్సవాల్లో భాగస్వాములవుతున్నారు. చివరి రోజు ప్రత్యేక కార్యక్రమాలు పూర్తికావడంతో 18రోజుల ఆధ్యాత్మిక వేడుకలకు సంప్రదాయబద్ధంగా తెరపడింది.