వెట్టిచాకిరీ నిర్మూలనకు చట్టపరమైన రక్షణ

06-11-2026 | 06:43pm

న్యాయసేవలపై ప్రతి ఒక్కరూ అవగాహన కలిగి ఉండాలి

మణుగూరు జేఎఫ్‌సీఎం సూరి రెడ్డి

మణుగూరు, నవంబర్ 6,(విజయక్రాంతి ): వెట్టిచాకిరీ వంటి బలవంతపు శ్రమ నుంచి విముక్తి పొందేందుకు చట్టపరమైన రక్షణలు ఉన్నాయని, ప్రతి ఒక్కరూ తమ హక్కులు, న్యాయసేవలపై(Rights and legal services) అవగాహన కలిగి ఉండాలని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కె. సూరి రెడ్డి అన్నారు. శుక్రవారం మణుగూరు కోర్టు(Manuguru Court) ఆవరణలో మండల న్యాయసేవాధికార సంస్థ(Mandal Legal Services Authority) ఆధ్వర్యంలో జాతీయ న్యాయసేవల దినోత్సవం(National Legal Services Day), నాల్సా వెట్టిచాకిరీ విముక్తి అంశాలపై న్యాయ చైతన్య సదస్సు నిర్వహించారు.

ఈ సందర్భంగా మెజిస్ట్రేట్ మాట్లాడుతూ,,, అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, ఇతర ఒత్తిళ్లను ఆసరాగా చేసుకొని వ్యక్తులను వారి ఇష్టానికి వ్యతిరేకంగా పనిచేయించడం, అప్పు తీర్చే పేరుతో వారి స్వేచ్ఛను హరించడం చట్టవిరుద్ధమని స్పష్టం చేశారు. ప్రతి ఒక్కరికీ స్వేచ్ఛగా జీవించే హక్కుతో పాటు, చేసిన పనికి తగిన ప్రతిఫలం పొందే హక్కు ఉందన్నారు.

వెట్టిచాకిరీ నిర్మూలనకు ప్రత్యేక చట్టాలు ఉన్నాయని, ఇలాంటి పరిస్థితులు ఎదురైతే బాధితులు సంబంధిత అధికారులను లేదా న్యాయసేవాధికార సంస్థలను సంప్రదించాలని సూచించారు.ఆర్థికంగా వెనుకబడినవారు, మహిళలు, పిల్లలు, కార్మికులు తదితర అర్హులైన వర్గాలకు ఉచితన్యాయసహాయం అందుబాటులో ఉందని తెలిపారు. సామాన్య ప్రజలకు న్యాయాన్ని చేరువ చేయడం, ప్రతి ఒక్కరికీ న్యాయం అందేలా చూడటమే న్యాయసేవాధికార సంస్థల ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మణుగూరు బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు ఎన్. సావిత్రి, లీగల్ ఎయిడ్ కౌన్సిల్ వీరంకి పద్మావతి, న్యాయవాదులు కె. నరసింహారావు, పి. భాస్కర్‌రావు, ఎ. సర్వేశ్వరరావు, సీహెచ్. సరస్వతి, ఈ. రాము, ఎం. వాసవి, బి. సునీత, కనకరాజు, ఎంఎల్‌ఎస్‌సీ సిబ్బంది ఎ. రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు