13 ప్రశ్నలకు జవాబేది?.. మరో 15 ప్రశ్నలతో సమరం

06-11-2026 | 10:36am

అమీన్‌పూర్, నవంబర్ 5 (విజయక్రాంతి): పట్టణాలను పరిశుభ్రంగా ఉంచుతూ మూడు దశాబ్దాలుగా పారిశుద్ధ్య పనులనే నమ్ముకుని జీవిస్తున్న స్వచ్ఛ ఆటో టిప్పర్ కార్మికుల ఉపాధి ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారుతోంది. తరతరాలుగా ఇదే వృత్తిపై ఆధారపడి కుటుంబాలను పోషించుకుంటున్న కార్మికులు ప్రస్తుత పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో స్వయం ఉపాధి కల్పనలో భాగంగా సబ్సిడీపై ఆటోలు పొందిన కార్మికులు ప్రస్తుతం బ్యాంకు రుణ వాయిదాలు చెల్లించలేక ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు ప్రైవేటు సంస్థల జోక్యంతో తమ జీవనోపాధికి ముప్పు ఏర్పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సుమారు రెండు నెలల క్రితం మున్సిపల్ కార్యాలయాల్లో స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలపై 13 ప్రశ్నలతో కూడిన వినతిపత్రాన్ని అందించినప్పటికీ ఇప్పటివరకు అధికారుల నుంచి స్పష్టమైన సమాధానం రాలేదని కార్మిక సంఘం ఆరోపిస్తోంది. తాజాగా మరోసారి 15 ప్రశ్నలతో కూడిన వినతిపత్రాన్ని ప్రభుత్వానికి అందిస్తూ తమ సమస్యలపై స్పష్టమైన సమాధానాలు ఇవ్వాలని కోరుతోంది. కార్మికుల ఉపాధి విధానం, కాంట్రాక్టు ఒప్పందాలు, ప్రభుత్వ సబ్సిడీ ఆటోలు, ప్రైవేటు వాహనాల వినియోగం, ట్రాన్స్‌ఫర్ స్టేషన్లలో సదుపాయాలు, కార్మికుల ఆర్థిక పరిస్థితులపై వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తోంది. వరుసగా వినతిపత్రాలు ఇస్తున్నా స్పందన లేకపోవడంపై కార్మికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

తమ పోరాటాన్ని బలహీనపరిచేలా ర్యాంకీ సంస్థ మరో ప్రయత్నం చేస్తున్నట్లు కార్మిక వర్గాల్లో చర్చ జరుగుతోంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలను (NGOs) భాగస్వాములుగా చేసుకుని మహిళలకు డ్రైవింగ్ శిక్షణ ఇచ్చి, నెలకు రూ.18 వేల వేతనంతో ఆటోలు అందించి ఉపాధి కల్పించే ప్రతిపాదనపై చర్చలు జరుగుతున్నట్లు కార్మికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రతిపాదనపై అధికారిక స్పష్టత రావాల్సి ఉంది.

మహిళలకు ఉపాధి కల్పించడాన్ని తాము వ్యతిరేకించడం లేదని స్వచ్ఛ ఆటో కార్మికులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికే పారిశుద్ధ్య రంగంలో అనేకమంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారని, వారికి కూడా కుటుంబ పోషణ బాధ్యతలు ఉన్నాయని గుర్తు చేస్తున్నారు. కొత్తగా మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించాలనుకుంటే ముందుగా ఈ రంగంలో ఏళ్ల తరబడి పనిచేస్తున్న మహిళా కార్మికులకే అవకాశాలు కల్పించాలని కోరుతున్నారు. మహిళల పేరుతో కొత్త విధానాలు తీసుకొచ్చి ఇప్పటికే ఈ పనులపై ఆధారపడుతున్న కార్మికులకు అన్యాయం చేయవద్దని విజ్ఞప్తి చేస్తున్నారు.

గత ప్రభుత్వ హయాంలో సబ్సిడీపై ఆటోలు పొందిన కార్మికులు బ్యాంకు రుణాలు తీసుకుని ఉపాధిని కొనసాగిస్తున్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఆటోల ద్వారా వచ్చే ఆదాయంతో కుటుంబ పోషణ, వాహన నిర్వహణతో పాటు నెలవారీ ఈఎంఐలు (EMI Payments) చెల్లించడం కష్టంగా మారిందని వాపోతున్నారు. వాయిదాలు చెల్లించలేకపోవడంతో సిబిల్ స్కోర్లు (CIBIL Score) దెబ్బతిని భవిష్యత్తులో రుణాలు పొందే అవకాశాలు కూడా తగ్గిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

మా పొట్టకొట్టొద్దు

గత మూడు దశాబ్దాలుగా తమ కుటుంబాలు పారిశుద్ధ్య పనులపైనే ఆధారపడి జీవిస్తున్నాయని కార్మికులు చెబుతున్నారు. తమ తాతలు, తండ్రులు కూడా ఇదే పని చేసుకుంటూ కుటుంబాలను పోషించుకున్నారని, తమకు తెలిసిన జీవనోపాధి ఇదొక్కటేనని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పుడు ప్రైవేటు సంస్థల విధానాలతో తమ పనులకు ఆటంకం కలిగితే కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వాలు, సంస్థలు ఏ నిర్ణయాలు తీసుకున్నా తమ తరతరాల ఉపాధిని దృష్టిలో ఉంచుకోవాలని కోరుతున్నారు.

అమీన్‌పూర్ పురపాలక సంస్థ (CMC) పరిధిలో పనిచేస్తున్న స్వచ్ఛ ఆటో కార్మికుల సమస్యలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని స్థానికంగా డిమాండ్ వినిపిస్తోంది. కార్మిక సంఘం ఇప్పటికే అందించిన 13 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడంతో పాటు తాజాగా సమర్పిస్తున్న 15 ప్రశ్నల వినతిపత్రంపైనా స్పందించాలని కోరుతున్నారు. ప్రైవేటు సంస్థలతో కుదుర్చుకున్న ఒప్పందాలు, కొత్త ఉపాధి ప్రతిపాదనలు, ఇప్పటికే పనిచేస్తున్న కార్మికుల భవిష్యత్తుపై పూర్తి వివరాలు వెల్లడించాలని డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల పరిశుభ్రత కోసం దశాబ్దాలుగా శ్రమిస్తున్న కార్మికుల కుటుంబాలను రోడ్డున పడేయకుండా వారి ఉపాధికి భరోసా కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంతో పాటు పురపాలక అధికారులపై ఉందని కార్మికులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు