బీసీ భవనాలకు రూ.88.50 కోట్లు
- ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి
- మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడి
- బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు నిధులు మంజూరు
- కుల సంఘాల ప్రతినిధులకు జీవో కాపీలు అందజేసిన మంత్రి
హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): రాష్ట్రంలో 38 బీసీ కుల సంఘాల(BC Community) ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలను వేగవంతం చేసేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గతంలో ఆయా కుల సంఘాలకు కేటాయించిన భవన నిర్మాణాలకు రూ.88.50 కోట్ల నిధులు మంజూరు చేస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది.
గురువారం హైదరాబాద్‌లో నిర్వహించిన కార్యక్రమంలో కుల సంఘాల ప్రతినిధులకు మంత్రి పొన్నం జీవో పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీసీ కుల సంఘాల ఆత్మగౌరవ భవనాలకు ప్రభుత్వం రూ.88.50 కోట్లు మంజూరు చేసిందని, ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయడమే లక్ష్యమన్నారు. గతంలో స్థలాలు కేటాయించినప్పటికీ పరిపాలనా, సాంకేతిక కారణాల వల్ల నిర్మాణాలు ముందుకు సాగలేదని, హెచ్ఎండీఏ సహకారంతో సమస్యలను పరిష్కరించామని చెప్పారు.
భవన నిర్మాణాల్లో జాప్యం జరగకుండా బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ప్రతి నెలా సమీక్ష నిర్వహించి నివేదికలు తీసుకుంటామని చెప్పారు. బీసీ కుల సంఘాలకు కేటాయించిన భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీసీలకు కేటాయించిన భూములు బలహీన వర్గాల ఆస్తులని, వాటి పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు. నిర్మాణాల్లో జాప్యం జరిగితే సంబంధిత సంఘాల ప్రతినిధులదే బాధ్యత అని పేర్కొన్నారు.
ప్రభుత్వ సలహాదారు వీ హనుమంతరావు మాట్లాడుతూ.. భవనాలను కార్యరూపంలోకి తీసుకురావడానికి బీసీలు కలిసికట్టుగా కృషి చేయాలని కోరారు. కులాల వారీగా తమ ప్రత్యేకతలను కాపాడుకుంటూనే ఐక్యతతో ముందుకు సాగాలని సూచించారు. జాజుల శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ ప్రభుత్వం వెనుకడుగు వేయకుండా మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో బీసీ కుల సంఘాలు, సంచార జాతుల ఆత్మగౌరవ భవనాల నిర్మాణాలకు బడ్జెట్ మంజూరు చేయడం అభినందనీయమన్నారు.
అన్ని కులాలకు కేటాయించినట్లుగానే, బీసీలకు కూడా హైదరాబాద్‌లో ఐదు ఎకరాల స్థలం కేటాయించి ‘బీసీ భవన్’ నిర్మించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ సురేష్ షెట్కర్, బీసీ సంక్షేమ శాఖ కమిషనర్ బాలమాయ దేవి, మాజీ ఓబీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్‌గౌడ్, మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి, ఇతర కార్పొరేషన్ చైర్మన్లు, బీసీ సంఘాల ముఖ్య నేతలు పాల్గొన్నారు.