కందిపప్పు రూ.180కే ఇస్తం!

06-11-2026 | 05:20am
  1. టెండర్లలో స్థానిక మిల్లర్లకే ప్రాధాన్యం ఇవ్వాలి
  2. నాన్ మిల్లింగ్ వ్యాపారులకు అవకాశం ఇవ్వద్దు  
  3. ఖమ్మం కలెక్టర్‌కు దాల్ మిల్లర్స్ అసోసియేషన్ వినతి

హైదరాబాద్, నవంబర్ 5 (విజయక్రాంతి): ప్రభుత్వ పథకాలు, ప్రజా సరఫరా అవసరాల కోసం ఖమ్మం జిల్లా(Khammam District)లో కందిపప్పు(ఎర్ర కందిపప్పు) సరఫరాకు నిర్వహించిన టెండర్లలో స్థానిక మిల్లర్లకే ప్రాధాన్యమివ్వాలని తెలంగాణ స్టేట్ దాల్ మిల్లర్స్ అసోసియేషన్ కోరింది. టెండర్లలో నాన్ మిల్లింగ్ వ్యాపారులు, మధ్యవర్తులను పరిగణనలోకి తీసుకోవడం వల్ల స్థానిక మిల్లర్లకు నష్టం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తం చేసింది.

ఈ మేరకు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ), సంబంధిత అధికారులకు అసోసియేషన్ ప్రతినిధులు కోడుమూరి శ్రీనివాసరావు, తేరాల ప్రవీణ్‌కుమార్, కటకం వీరేందర్, బిక్కుమండ్ల శ్రీధర్, అభిషేక్ అగర్వాల్, ఉదయ భాస్కర్ వినతిపత్రం సమర్పించారు. ప్రస్తుతం టెండర్లలో కిలో కందిపప్పుకు రూ.194.50 ధరను ఓ వ్యాపారి కోట్ చేసినట్లు తమ దృష్టికి వచ్చిందని అసోసియేషన్ పేర్కొంది. అయితే తెలంగాణలో నమోదైన స్థానిక దాల్ మిల్లర్లు కిలో పప్పు రూ.180కే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపింది. దీనివల్ల ప్రభుత్వానికి కిలోకు రూ.14.50 చొప్పున ఆదా అవుతుందని వివరించింది. టెండర్లను స్థానిక మిల్లర్లకు కేటాయిస్తే ప్రజాధనం ఆదా కావడంతో పాటు నాణ్యతతో కూడిన సరఫరా సాధ్యమవుతుందని పేర్కొంది.

తెలంగాణలోని దాల్ మిల్లింగ్ యూనిట్లు చిన్న, మధ్య తరహా పరిశ్రమలుగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్నాయని అసోసియేషన్ వివరించింది. స్థానిక మిల్లర్లను కాదని ఇతర ప్రాంతాల నుంచి ప్రాసెస్ చేసిన కందిపప్పును కొనుగోలు చేసే వ్యాపారులకు కాంట్రాక్టులు కేటాయించడం వల్ల రాష్ట్రంలోని పరిశ్రమలకు నష్టం కలుగుతుందని పేర్కొంది. మిల్లింగ్ కార్యకలాపాలు నిర్వహించని వ్యాపారులు, మధ్యవర్తులకు టెండర్లలో అవకాశం కల్పించడం సరికాదని అభిప్రాయపడింది. స్థానిక దాల్ మిల్లర్లు తెలంగాణ వ్యవసాయ మార్కెట్ల నుంచి నేరుగా రైతుల వద్ద కందులను కొనుగోలు చేస్తారని అసోసియేషన్ తెలిపింది.

స్థానిక మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వడం వల్ల రైతులకు పంటకు స్థిరమైన మార్కెట్ లభించడంతో పాటు మెరుగైన ధరలు పొందే అవకాశం ఉంటుందని వివరించింది. రాష్ట్రంలో వ్యవసాయ, పారిశ్రామిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఇది దోహదపడుతుందని పేర్కొంది. టెండర్లలో షార్ట్లిస్ట్ చేసిన బిడ్డర్ల జాబితాను మరోసారి పరిశీలించి, మిల్లింగ్ యూనిట్లు లేని వ్యాపారులను సరఫరా ప్రక్రియ నుంచి తప్పించాలని అసోసియేషన్ కోరింది. తెలంగాణలో నమోదైన దాల్ మిల్లర్లకు టెండర్ల కేటాయింపులో ప్రాధాన్యత ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది.

అలాగే కిలో కందిపప్పుకు సుమారు రూ.180 ధరతో స్థానిక మిల్లర్ల నుంచి సరఫరా చేసుకునే అవకాశాన్ని పరిశీలించాలని కోరింది. ప్రభుత్వానికి తక్కువ ధరకు నాణ్యమైన కందిపప్పు అందించడంతో పాటు స్థానిక పరిశ్రమలు, రైతులకు మేలు జరిగేలా టెండర్ల విధానాన్ని పునఃసమీక్షించాలని అసోసియేషన్ ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై అధికారులను కలిసి మరిన్ని వివరాలు, ఆధారాలు సమర్పించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.

మరిన్ని వార్తలు