ధాన్యం కొనుగోళ్లు పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలి: జిల్లా కలెక్టర్ అంకిత్
భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వానాకాలం ధాన్యం కొనుగోలు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించి రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు చేయాలని జిల్లా కలెక్టర్ అంకిత్(District Collector Ankit) సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం ఐ.డి.ఓ.సి. సమావేశ మందిరంలో జిల్లా పౌర సరఫరాల సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన వానాకాలం ధాన్యం కొనుగోలు సన్నాహక సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ డి. వేణుగోపాల్‌తో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు.
కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, వ్యవసాయ, సహకార, డీఆర్‌డీఏ, తూనికలు–కొలతలు, రవాణా, మార్కెటింగ్ శాఖల అధికారులు, రైస్ మిల్లర్లు సమావేశానికి హాజరయ్యారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వానాకాలం సీజన్‌లో సుమారు 1,28,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు. ఇందులో 1,24,119 మెట్రిక్ టన్నుల సన్న రకం, 3,881 మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యం ఉంటుందని తెలిపారు. ధాన్యం కొనుగోలుకు జిల్లాలో 190 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
అవసరాన్ని బట్టి అదనపు కొనుగోలు కేంద్రాలను కూడా ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతులు పండించిన ధాన్యానికి ప్రభుత్వం నిర్ణయించిన మద్దతు ధర అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. ఏ గ్రేడ్ ధాన్యానికి క్వింటాకు రూ.2,461, సాధారణ గ్రేడ్ ధాన్యానికి రూ.2,441 మద్దతు ధరగా నిర్ణయించబడిందని తెలిపారు. సన్న రకం ధాన్యానికి మద్దతు ధరతో పాటు అదనంగా క్వింటాకు రూ.500 బోనస్ అందజేయనున్నట్లు తెలిపారు.
జిల్లాలో BPT 5204, RNR 15048, HMT సోనా, జైశ్రీరామ్ సిగ్మెంటల్, KNM 1638, WGL 44, KNM 7715 అనే ఏడు రకాల సన్న వడ్లకు ఈ బోనస్ వర్తిస్తుందని తెలిపారు. దీంతో సన్న రకం ధాన్యానికి క్వింటాకు మొత్తం రూ.2,961 వరకు లభించేలా కొనుగోలు ప్రక్రియ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి, కొనుగోలు రసీదులు అందజేయాలని కలెక్టర్ ఆదేశించారు. రైతులకు చెల్లింపులు సకాలంలో జరిగేలా అధికారులు ప్రత్యేకంగా పర్యవేక్షించాలని సూచించారు.
కొనుగోలు కేంద్రాల్లో నాణ్యత ప్రమాణాలు, మద్దతు ధర, బోనస్, ఫిర్యాదుల పరిష్కారానికి సంబంధిత అధికారుల వివరాలను స్పష్టంగా ప్రదర్శించాలని తెలిపారు. రైతులు తీసుకొచ్చిన ధాన్యాన్ని ఎక్కువ కాలం కొనుగోలు కేంద్రాల్లో నిల్వ చేయకుండా తక్షణమే రైస్ మిల్లులకు తరలించేలా రవాణా ఏర్పాట్లను పకడ్బందీగా చేయాలని ఆదేశించారు.
ధాన్యం నాణ్యతా ప్రమాణాల పేరుతో రైతులను ఇబ్బందులకు గురిచేయడం, తరుగు పేరుతో అన్యాయంగా కోతలు విధించడం వంటి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని కలెక్టర్ హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, సంబంధిత రైస్ మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రైతులకు ధాన్యం విక్రయ ప్రక్రియ, మద్దతు ధర, నాణ్యతా ప్రమాణాలు, సన్న రకం ధాన్యానికి లభించే బోనస్‌పై వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ విద్యా చందన, పౌర సరఫరాల అధికారి ప్రేమ్ కుమార్ , పౌర సరఫరాల సంస్థ మేనేజర్ త్రినాధ్ బాబు, జిల్లా వ్యవసాయ అధికారి బాబురావు, రవాణా శాఖ అధికారి భూషిత్ రెడ్డి , మార్కెటింగ్ అధికారి అలీమ్ , రైస్ మిల్లర్ అసోసియేషన్ ప్రతినిధులు ఆనందరావు, కొనుగోలు కేంద్రాల ఇన్‌చార్జిలు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.