దళిత సర్పంచ్ అని చులకనగా చూస్తున్నారు
అభివృద్ధికి ఆటంకం కలిగిస్తున్నారు
సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి ఆవేదన
బెజ్జూర్: తాను దళిత మహిళా సర్పంచ్ అనే కారణంతోనే అధికారులు, కొందరు ప్రజాప్రతినిధులు చులకనగా చూస్తున్నారని, గ్రామ అభివృద్ధికి తీవ్ర ఆటంకం కలిగిస్తున్నారని బెజ్జూర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ దుర్గం సరోజ తిరుపతి(Sarpanch Durgam Saroja Thirupati) ఆవేదన వ్యక్తం చేశారు. మండల కేంద్రంలోని రైతు వేదికలో మంగళవారం జరిగిన మండల సర్వసభ్య సమావేశంలో ఆమె తన గోడును వెళ్లబోసుకున్నారు.
"ప్రజలు నన్ను నమ్మి సర్పంచ్ గా గెలిపించారు. గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ఎన్నో ఆశలతో వచ్చాను. కానీ గత మూడు నెలల క్రితం పంచాయతీకీ అధికారులు వచ్చి పంచాయతీ రికార్డులన్నీ తీసుకెళ్లారు. అప్పటి నుండి గ్రామంలో ఏ చిన్న పని చేయాలన్నా రికార్డులు లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు" అని ఆమె వాపోయారు. మండల కేంద్రంలో బస్టాండ్ నిర్మాణాన్ని చేపడితేనే గ్రామపంచాయతీ రికార్డులు ఇస్తామని అధికారులు బెదిరింపు ధోరణిలో మాట్లాడుతున్నారని ఆరోపించారు.
తాను అధికార పార్టీలో లేనందున, పైగా దళిత మహిళ అయినందున తనను కావాలనే వేధిస్తున్నారని, ఇది రాజ్యాంగం కల్పించిన రిజర్వేషన్ వ్యవస్థను అవమానించడమేనని ఆవేదన చెందారు. "నేను గ్రామ అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారు. ఫండ్స్ ఉన్నా రికార్డులు లేక పనులు చేయలేకపోతున్నా. ఈ కారణంగా బెజ్జూర్ ప్రజలకు అభివృద్ధి చేయలేకపోతున్నందుకు నన్ను మన్నించండి" అంటూ సమావేశంలోనే ప్రజలకు క్షమాపణలు చెప్పారు. తనకు న్యాయం జరగకపోతే పాలకవర్గంతో కలిసి కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన దీక్ష చేపడతానని ఆమె హెచ్చరించారు.