దేవుళ్లను రాజకీయాల్లోకి లాగడం సరికాదు
బీజేపీ జిల్లా కార్యదర్శి బోడ పూనియా నాయక్
టేకులపల్లి, (విజయక్రాంతి): దేవుళ్లను రాజకీయ ప్రయోజనాల కోసం ఉపయోగించడం సరికాదని బీజేపీ జిల్లా కార్యదర్శి బోడ పూనియా నాయక్ అన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆదేశాల మేరకు మంగళవారం టేకులపల్లి మండల కేంద్రంలో బీజేపీ నాయకులు సీఎం రేవంత్‌రెడ్డి(CM Revanth Reddy) దేవతలపై చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ ఆందోళన నిర్వహించారు. శ్రీరాముడు, పరమశివుడు కోట్లాది మంది ప్రజల ఆరాధ్య దైవాలని, వారిని పేదలు, ధనికులుగా విభజిస్తూ వ్యాఖ్యలు చేయడం తగదన్నారు.
దేవతలపై చేసిన వ్యాఖ్యలను సీఎం వెంటనే వెనక్కి తీసుకుని ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులు, యువత, విద్యార్థుల సమస్యలు, ప్రభుత్వ హామీల అమలుపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. మత విశ్వాసాలను రాజకీయ చర్చల్లోకి తీసుకురావడం ద్వారా ప్రజల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు శంభునాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు ధరావత్ బాలాజీ, గిరిజన మోర్చా జిల్లా నాయకుడు రవి రాథోడ్, మండల అధ్యక్షుడు వినోద్, నాయకులు చిక్క వెంకటేశ్వర్లు, నెల్లూరి సత్యం తదితరులు పాల్గొన్నారు.