కరువు మండలాలను ప్రభుత్వం ఆదుకోవాలి
ఎస్కేయం డిమాండ్
ములకలపల్లి,నవంబర్ 26( విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ(Central Government) రైతు,కార్మిక,ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దులో పోరాటం ప్రారంభం అయిన దినం 2020 నవంబర్ 26ను పురస్కరించుకొని దేశవ్యాప్తంగా జిల్లా,మండల కేంద్రాల్లో భారీ ఎత్తున ప్రదర్శన, ధర్నాలకు సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేయం) కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది.ఆ పిలుపులో భాగంగా గురువారం ములకలపల్లి మండల కేంద్రంలో ఎస్కేయం ఆధ్వర్యంలో ర్యాలీ, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎస్కేయం నాయకులు ముదిగొండ రాంబాబు,కోర్సా రామకృష్ణ,నకిరికంటి నాగేశ్వరరావు,ఎర్ర గొర్ల రామారావు మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ 12 సంవత్సరాలుగా దేశాన్ని పాలిస్తుందని,రైతులకు ఇచ్చిన ఏ హామీని నిలబెట్టుకోలేదని విమర్శించారు.స్వామినాథన్ సిఫార్సుల ప్రకారం ఉత్పత్తి ఖర్చుకు 50 శాతం కలిపి కనీస మద్దతు ధర ఇస్తామని,రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని చెప్పి మోసం చేశారని అన్నారు.
2020లో తెచ్చిన మూడు రైతు వ్యతిరేక చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో 383 రోజులు రైతులు పోరాడారని,ఆ పోరాటంలో 736 మంది అమరులయ్యారని గుర్తు చేశారు.ఆ పోరాటం వల్లే చట్టాలు వెనక్కి తీసుకున్నారని,కానీ ఇప్పుడు అదే చట్టాలను వేరే రూపంలో నూతన వ్యవసాయ మార్కెట్ చట్టం,నేషనల్ కో-ఆపరేటివ్ పాలసీ,డిజిటల్ అగ్రికల్చరల్ మిషన్,విత్తన బిల్లు,విద్యుత్ బిల్లు రూపంలో తెస్తున్నారని మండిపడ్డారు.
అమెరికా,ఇతర దేశాలతో చేసుకుంటున్న ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్లు,వాణిజ్య ఒప్పందాలు మన చిన్న,సన్నకారు రైతులను నాశనం చేస్తాయని,దేశ స్వావలంబనను తాకట్టు పెడుతున్నాయని ఆరోపించారు.తెలంగాణలో ఎల్ నినో ప్రభావంతో 365 మండలాలను కరువు మండలాలుగా ప్రభుత్వమే ప్రకటించిందని,రబీ సీజన్ క్రాప్ హాలిడేగా ప్రభుత్వమే ప్రకటించిందన్నారు.రైతులు బ్యాంకులు,ప్రైవేట్ వ్యాపారస్తుల ద్వారా అప్పులు చేసి వ్యవసాయానికి పెట్టుబడులు పెట్టారని
,రైతుల రుణాలు బ్యాంకులలో పేరుకు పోతున్నాయని తెలిపారు.రైతుల పంట రుణాలపై మారిటోరియం విధించడం మాత్రమే సరిపోదని,వాటిని రద్దు చేసి కొత్త రుణాలను ఇవ్వాలని,అదే విధంగా విత్తనాలు,ఎరువులు సమకూర్చాలని డిమాండ్ చేశారు.పంట నష్టపోయిన రైతులకు నష్టపరిహారాన్ని ఇవ్వాలని,వరికి 30 వేలు, పత్తి, కంది, పెసర, సోయాబీన్ లాంటి వాణిజ్య పంటలకు 50 వేలు నష్టపరిహారంగా అందించాలని కోరారు.పనులు కోల్పోతున్న
రైతులకు,వ్యవసాయ కూలీలకు ఉపాధి హామీ పథకం వి బి జి రామ్ జి కింద పనులను చూపించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఎస్కేయం నాయకులు బండారు నాగేంద్రబాబు,పద్దం లక్ష్మణరావు,మడివి రమేష్,మడివి ఇరమ,పోడియం రాజు,అవినాష్ మరియు రైతులు,కార్మికులు,యువకులు పాల్గొన్నారు.