ఓటు ఆయుధంతోనే దళిత, బహుజనులకు రాజ్యాధికారం

26-11-2026 | 11:45pm

మిడ్జిల్‌లో ఘనంగా ఓటు చైతన్య రథయాత్ర ప్రారంభం 

మిడ్జిల్, నవంబర్ 26: ఓటు అనే ఆయుధంతోనే దళిత, బహుజనులకు రాజ్యాధికారం సాధ్యమవుతుందని అంబేద్కర్ సంఘం(Ambedkar Association) రాష్ట్ర నాయకులు అడ్వకేట్ రాములు నాయక్ అన్నారు. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం మిడ్జిల్ మండల కేంద్రంలో ఆయన ఆధ్వర్యంలో 'ఓటు చైతన్య రథయాత్ర' ఘనంగా ప్రారంభమైంది. ముందుగా స్థానిక డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నాయకులు, అనంతరం పాదయాత్ర చేపట్టి చైతన్య యాత్రకు శ్రీకారం చుట్టారు.

ఈ సందర్భంగా రాములు నాయక్ మాట్లాడుతూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కుపై దళిత, బహుజనుల్లో పూర్తిస్థాయి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి ఓటు విలువను వివరించాలని సూచించారు. దళిత, బహుజనులు కేవలం ఓటర్లుగానే మిగిలిపోకుండా రాజ్యాధికారం సాధించే దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ చైతన్య యాత్ర ఉమ్మడి కల్వకుర్తి నియోజకవర్గంలోని ఊరుకొండ, తలకొండపల్లి, ఆమనగల్, మాడుగుల, వెల్దండ, చారగొండ, వంగూరు మండలాల్లోని వివిధ గ్రామాల్లో కొనసాగనుంది. అనంతరం కల్వకుర్తిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అంబేద్కర్ పూలే జాతర రాష్ట్ర సలహాదారులు సుధాకర్, అంబేద్కర్ సంఘం రాష్ట్ర నాయకులు బరిగల బాలయ్య, దళిత బహుజన రాష్ట్ర నాయకులు మావిళ్ల వెంకటయ్య, బీజేపీ జిల్లా నాయకులు రాజేశ్వర్, అంబేద్కర్ సంఘం మండల అధ్యక్షులు దేవయ్య, బీజేపీ మండల అధ్యక్షులు నరేష్ నాయక్, దళిత బహుజన నాయకులు బుచ్చయ్య, ఆంజనేయులు, మహనీయుల కళామండలి రాష్ట్ర నాయకులు శ్రీకాంత్, సాయిరాం, మహిళా కళాకారులు రేణుక, అలివేలు, సువర్ణ, మంగమ్మతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు