లోయలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు బలి
హిమాచల్ ప్రదేశ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం (Road Accident) చోటుచేసుకుంది. షిమ్లా జిల్లాలోని రాంపూర్ సమీపంలో ఓ కారు అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో ముగ్గురు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. రాంపూర్–గౌరా లింక్ రోడ్డులోని పషాడా మలుపు సమీపంలో సోమవారం తెల్లవారుజామున సుమారు 3 గంటల సమయంలో ఈ ప్రమాదం (Car Accident) జరిగింది. పెళ్లి వేడుకకు హాజరై ఐదుగురు కారులో తిరిగి వస్తుండగా డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోవడంతో కారు లోయలో పడిపోయినట్లు ప్రాథమికంగా తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న పోలీసులు (Police), అగ్నిమాపక సిబ్బంది, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి. గాయపడిన ఇద్దరిని రాంపూర్‌లోని ఖనేరి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.మృతులను రామానంద్, ఓం ప్రకాశ్, హమేంద్రగా గుర్తించారు. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు (Investigation) చేపట్టారు.