ముందస్తు పరీక్షలతో టీబీకి చెక్

16-11-2026 | 05:33pm

న్యూఢిల్లీ: క్షయ వ్యాధి (టీబీ) నియంత్రణలో భారత్ గణనీయమైన పురోగతి సాధించింది. దేశంలో టీబీ కారణంగా సంభవిస్తున్న మరణాలు 2015తో పోలిస్తే 38 శాతం తగ్గినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ(World Health Organization) 2026 నివేదిక వెల్లడించింది. అదే సమయంలో డ్రగ్ సెన్సిటివ్ టీబీ రోగుల్లో చికిత్స విజయవంతమైన వారి శాతం 94కు చేరడం విశేషం. కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం వ్యాధిని ముందుగానే గుర్తించడం, ఆధునిక పరీక్షలు, సకాలంలో చికిత్స అందించడం ఈ పురోగతికి దోహదపడ్డాయి.

25 కోట్ల మందికి స్క్రీనింగ్

దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్ ద్వారా కోట్లాది మందికి వ్యాధి నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. 2024 డిసెంబర్ నుంచి 2026 నవంబర్ 8 వరకు 25 కోట్ల మందికి పైగా స్క్రీనింగ్ పరిధిలోకి తీసుకొచ్చారు. ఇందులో భాగంగా 11 కోట్లకు పైగా ఛాతీ ఎక్స్‌రేలు, 3 కోట్లకు పైగా మాలిక్యులర్ పరీక్షలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం 48.64 లక్షల టీబీ కేసులను గుర్తించగా, వీరిలో 14.97 లక్షల మందికి వ్యాధి లక్షణాలు కనిపించకపోయినా పరీక్షల ద్వారా గుర్తించడం గమనార్హం.

మరణాల రేటులోనూ తగ్గుదల

2015లో ప్రతి లక్ష జనాభాకు 28గా ఉన్న టీబీ మరణాల రేటు 2025 నాటికి 18కి తగ్గింది. అంటే వ్యాధి మరణాల రేటులో గణనీయమైన మార్పు నమోదైంది. రోగులకు మెరుగైన వైద్య సేవలు, ఏఐ ఆధారిత ఎక్స్‌రే పరీక్షలు, వేగవంతమైన నిర్ధారణ పద్ధతులు ఈ ఫలితాల్లో కీలక పాత్ర పోషించాయి.

పోషకాహారానికి ప్రత్యేక సాయం

టీబీ చికిత్స పొందుతున్న రోగులకు వైద్య సేవలతో పాటు పోషకాహార సహకారం అందించడంపైనా ప్రభుత్వం దృష్టి సారించింది. నిక్షయ్ పోషణ్ యోజన, నిక్షయ్ మిత్ర కార్యక్రమాల ద్వారా రోగులకు ఆర్థిక, పోషకాహార, సామాజిక మద్దతు అందిస్తున్నారు. వ్యాధిని ముందుగానే గుర్తించడం, పూర్తిస్థాయి చికిత్స తీసుకోవడం ద్వారా టీబీ నిర్మూలన లక్ష్యాన్ని చేరుకోవచ్చని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు