7 లక్షల కుటుంబాలకు గుడ్న్యూస్
హైదరాబాద్: పాత ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తెలంగాణ ప్రభుత్వం తీపి కబురు అందించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఇళ్ల పథకాల కింద ఇళ్లు నిర్మించుకున్న వారికి సంబంధించిన ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను తిరిగి అందించాలని నిర్ణయించింది. ఈ మేరకు జిల్లా కలెక్టర్లకు అవసరమైన ఆదేశాలు జారీ చేసినట్లు రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వెల్లడించారు.
గతంలో ఇళ్ల నిర్మాణం కోసం బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు పొందిన సమయంలో పలువురు లబ్ధిదారులు తమ ఇంటి పట్టాలను తనఖా పెట్టారు. రుణాలు చెల్లించినప్పటికీ కొందరికి ఆ పత్రాలు తిరిగి అందలేదు. దీంతో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కుటుంబాలకు ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం ఊరటనివ్వనుంది. తహసీల్దార్ కార్యాలయాల్లో ఉన్న పాత ఇంటి పట్టాలు, పొజిషన్ సర్టిఫికెట్లను గుర్తించి అర్హులైన లబ్ధిదారులకు తిరిగి అందించాలని కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 7 లక్షల మంది లబ్ధిదారులకు ప్రయోజనం చేకూరనుందని పొంగులేటి తెలిపారు.