తెలంగాణ మహిళా భద్రతా విభాగానికి కొత్త డీజీపీ
హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో కీలక బాధ్యతల మార్పు చోటుచేసుకుంది. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం డీజీపీగా సీనియర్ ఐపీఎస్ అధికారిణి డాక్టర్ సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. సోమవారం హైదరాబాద్‌లోని లక్డీకాపూల్‌లో ఉన్న మహిళా భద్రతా విభాగం కార్యాలయంలో ఆమె పదవీ బాధ్యతలు చేపట్టారు. 1994 బ్యాచ్‌కు చెందిన సౌమ్య మిశ్రా ఇప్పటివరకు డీజీపీగా (జైళ్లు, కరెక్షనల్ సర్వీసెస్) బాధ్యతలు నిర్వహించారు. తాజాగా జరిగిన ఐపీఎస్ అధికారుల బదిలీల్లో భాగంగా ఆమెకు మహిళా భద్రతా విభాగం బాధ్యతలు అప్పగించారు.
ఇప్పటివరకు మహిళా భద్రతా విభాగం డీజీపీగా పనిచేసిన చారు సిన్హా నుంచి సౌమ్య మిశ్రా బాధ్యతలు స్వీకరించారు. కొత్త బాధ్యతల్లో భాగంగా మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన కార్యక్రమాలు, షీ టీమ్స్, భరోసా వంటి విభాగాల కార్యకలాపాల పర్యవేక్షణ ఆమె పరిధిలో ఉండనుంది. మహిళల భద్రత, అవగాహన కార్యక్రమాలు, బాధితులకు సహాయం వంటి అంశాల్లో ఈ విభాగం కీలక పాత్ర పోషిస్తోంది.