గుజరాత్‌పై ముంబై జోరు!

16-11-2026 | 04:57pm

కోల్‌కతా: టీమిండియా స్టార్ బ్యాటర్ సూర్యకుమార్ యాదవ్(Star batter Suryakumar Yadav) మరోసారి తనదైన శైలిలో చెలరేగిపోయాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ 2026లో గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో సిక్సర్లు, ఫోర్లతో విరుచుకుపడ్డాడు. కేవలం 29 బంతుల్లోనే 82 పరుగులు చేసి ముంబై విజయంలో కీలక పాత్ర పోషించాడు. సూర్య మెరుపు ఇన్నింగ్స్‌తో ముంబై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది.

ఆకాశమే హద్దుగా సూర్య బ్యాటింగ్

198 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ముంబైకి సూర్యకుమార్ యాదవ్ తన బ్యాట్‌తో అండగా నిలిచాడు. క్రీజులోకి వచ్చినప్పటి నుంచే గుజరాత్ బౌలర్లపై ఎదురుదాడికి దిగాడు. కేవలం 29 బంతులు ఎదుర్కొన్న సూర్య 9 ఫోర్లు, 7 సిక్సర్లతో 82 పరుగులు సాధించాడు. అతడి స్ట్రైక్ రేట్ ఏకంగా 282.76గా నమోదైంది. అయితే సెంచరీ దిశగా దూసుకెళ్తున్న సూర్యను రవి బిష్ణోయ్ పెవిలియన్‌కు పంపాడు.

సర్ఫరాజ్ మెరుపులు.. ముంబై సునాయాస ఛేదన

సూర్య ఔటైన తర్వాత సర్ఫరాజ్ ఖాన్ తన దూకుడును కొనసాగించాడు. కేవలం 17 బంతుల్లో 40 పరుగులతో అజేయంగా నిలిచాడు. మరోవైపు అథర్వ అంకోలేకర్ ఐదు బంతుల్లోనే 15 పరుగులు చేసి జట్టు విజయాన్ని పూర్తి చేశాడు. దీంతో ముంబై 15.4 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి 201 పరుగులు సాధించింది. 26 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి ఐదు వికెట్ల తేడాతో గెలుపొందింది.

తొలుత గుజరాత్ 197 పరుగులు

అంతకుముందు టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ 19.2 ఓవర్లలో 197 పరుగులకు ఆలౌటైంది. ఆశుతోష్ శర్మ 22 బంతుల్లో 42 పరుగులు చేయగా, విశాల్ జైస్వాల్ 21 బంతుల్లో 38 పరుగులతో రాణించాడు. ముంబై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్, అథర్వ అంకోలేకర్ తలో మూడు వికెట్లు పడగొట్టారు. లక్ష్య ఛేదనలో సూర్యకుమార్ విధ్వంసంతో ముంబై విజయాన్ని సొంతం చేసుకుంది.

మరిన్ని వార్తలు