కాంగ్రెస్‌పై హరీశ్ రావు ఫైర్
హైదరాబాద్: తెలంగాణలో సాగునీటి ప్రాజెక్టులు, ఎన్నికల హామీల అమలుపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ మాజీ మంత్రి హరీశ్ రావు(Former BRS Minister Harish Rao) తీవ్రంగా ప్రశ్నించారు. ఢిల్లీలో మంత్రి ఉత్తమ్ కుమార్(Minister Uttam Kumar Reddy) రెడ్డి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. కాంగ్రెస్ ప్రభుత్వం అసలు విషయాలను పక్కదారి పట్టిస్తోందని విమర్శించారు.
నీళ్లు అందుబాటులో లేని ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రతిపాదించిన కాంగ్రెస్‌కు, నీటి వనరులున్న చోట ప్రాజెక్టులు నిర్మించి రైతులకు సాగునీరు అందించిన ఘనత బీఆర్ఎస్దేనని హరీశ్ రావు పేర్కొన్నారు. ప్రాజెక్టుల నిర్మాణంలో ఆలస్యం చేసి ఇప్పుడు తమపై విమర్శలు చేయడం సరికాదన్నారు. అధికారంలోకి వచ్చి దాదాపు మూడేళ్లు అవుతున్నా కొత్తగా ఒక్క ప్రాజెక్టునైనా నిర్మించారా? అని ప్రశ్నించారు.
మల్లన్నసాగర్(Mallanna Sagar), రంగనాయకసాగర్ ప్రాజెక్టుల నిర్మాణ సమయంలో ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నిర్వాసితులకు పరిహారం పెంచాలని డిమాండ్ చేస్తూ ఆందోళనలు చేశారని హరీశ్ గుర్తుచేశారు. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత మల్లన్నసాగర్ నిర్వాసితుల సమస్యలను ఎందుకు పరిష్కరించడం లేదని నిలదీశారు.
ప్రభుత్వ ఎన్నికల హామీల(Congress election promises)పైనా హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం ఎప్పుడు అందిస్తారని ప్రశ్నించారు. ఇప్పటివరకు ఒక్కో మహిళకు రూ.90 వేల మేర బాకీ పడిందని ఆరోపించారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని బాండ్ పేపర్లు ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కూడా స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ నుంచి సంక్షేమ పథకాల అమలు వరకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సిన అంశాలు చాలానే ఉన్నాయని హరీశ్ రావు వ్యాఖ్యానించారు.