ఏకలవ్య విద్యార్థుల జాతీయ స్థాయి సత్తా.. సీఎం రేవంత్ హర్షం
రాష్ట్రపతి భవన్కు తెలంగాణ బిడ్డలు.. 18 మందికి అరుదైన అవకాశం!
హైదరాబాద్: మారుమూల గిరిజన ప్రాంతాల నుంచి వచ్చి జాతీయ స్థాయిలో ప్రతిభ చాటిన తెలంగాణ విద్యార్థులు అరుదైన గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా ఎంపికైన 23 మంది విద్యార్థుల్లో తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్స్(Telangana Eklavya Model Residential Schools)కు చెందిన 18 మంది చోటు దక్కించుకున్నారు. రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది(President Droupadi Murmu) ముర్ముతో ముఖాముఖిగా మాట్లాడే అవకాశం లభించింది.
జన్జాతీయ గౌరవ్ దివస్ వేడుకల్లో(Janjatiya Gaurav Diwas Celebrations) భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించగా, తెలంగాణ విద్యార్థుల ఘనతపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth reddy) హర్షం వ్యక్తం చేశారు. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందిస్తూ వారిని ఉన్నత శిఖరాలకు చేర్చడంలో కృషి చేసిన అధికారులు, ఉపాధ్యాయులు, సిబ్బందిని అభినందించారు.
పేదింటి నుంచి ప్రతిష్టాత్మక విద్యాసంస్థల వరకు!
ఎలాంటి ఆర్థిక నేపథ్యం లేకున్నా ప్రతిభ, పట్టుదలతో ఈ విద్యార్థులు ఉన్నత విద్యావకాశాలను అందిపుచ్చుకున్నారు. ఐఐటీ, ఎన్ఐటీ, ఐఐఐటీలతో పాటు ప్రముఖ వైద్య విద్యాసంస్థల్లో ప్రవేశాలు సాధించి తమ సత్తా చాటారు.
వీరిలో చాలామంది ఐదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు తెలంగాణ ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లలోనే విద్యనభ్యసించడం విశేషం. గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య, సరైన మార్గదర్శకత్వం అందిస్తే జాతీయ స్థాయిలోనూ అద్భుతాలు సాధించగలరనేందుకు ఈ విజయం నిదర్శనంగా నిలుస్తోంది.