టౌన్ ప్లానింగ్ అధికారిణికి ఉచ్చు

16-11-2026 | 01:11pm

లంచం కేసులో చిక్కిన అధికారిణి ఇంట్లో ఏసీబీ సోదాలు

రంగారెడ్డి: లంచం కేసులో ఇప్పటికే ఏసీబీకి పట్టుబడిన మొయినాబాద్ మున్సిపల్ టౌన్ ప్లానింగ్(Moinabad Municipal Town Planning) అధికారిణి గుండు వాణికి మరో షాక్ తగిలింది. ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టారనే ఆరోపణలతో అవినీతి నిరోధక శాఖ (ACB) అధికారులు ఆమె నివాసంలో సోదాలు చేపట్టారు. అత్తాపూర్‌లోని ఇంటితో పాటు హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో తనిఖీలు కొనసాగిస్తున్నారు.

రూ.75 వేల లంచం కేసుతో వెలుగులోకి వచ్చిన వ్యవహారం!

గత సెప్టెంబర్ 30న అక్రమ నిర్మాణంపై చర్యలు తీసుకోకుండా ఉండేందుకు వాణి రూ.75 వేలు లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఆమె తరఫున నగదు తీసుకుంటున్న సీనియర్ అసిస్టెంట్ యలమోని సుదర్శన్‌ను అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అతడి వద్ద నుంచి రూ.75 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వాణి, సుదర్శన్‌లను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.

అక్రమాస్తుల కేసులో కీలక తనిఖీలు!

లంచం వ్యవహారం తర్వాత వాణిపై ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన అధికారులు తాజాగా సోదాలకు దిగారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తూ భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో ఈ తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్, రంగారెడ్డి ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాల్లో ఎలాంటి వివరాలు బయటపడతాయన్నది ఆసక్తికరంగా మారింది. ఏసీబీ తనిఖీలు పూర్తయిన తర్వాతే ఆస్తులకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు