నా కథ జనం వింటారనే..!
ఆటోబయోగ్రఫీ రచనపై సోనియాగాంధీ వెల్లడి
- మన చుట్టూ కొందరు ఏవేవో కథలు అల్లేస్తారు
- మా కుటుంబంపైనా అవాస్తవాలను ప్రచారం చేశారు
- వాటికి చెక్ పెట్టేందుకే ఆత్మకథను తీసుకువచ్చానని వివరణ
- ఢిల్లీలో ఘనంగా ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ ఆవిష్కరణ
న్యూఢిల్లీ, నవంబర్ 16: వాస్తవాలను ప్రపంచానికి చాటిచెప్పేందుకే తాను ఆత్మకథను(Autobiography) రాశానని, దీన్ని ప్రజలు చదువుతారన్న నమ్మకం ఉందని కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్ పర్సన్ సోనియాగాంధీ(Sonia Gandhi) అన్నా రు. తమ కుటుంబం గురించి ఎన్నో అవాస్తవాలు ప్రచారంలోకి వచ్చాయని, వాటికి సమాధానం చెప్పేందుకు తాను కలం పట్టాల్సి వచ్చిందన్నారు. సోనియాగాంధీ ఆత్మకథ(Sonia Gandhi's autobiography) ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్(Belonging: A Journey of Love)’ పుస్తకావిష్కరణ కార్యక్రమం(Book Launch Event) సోమవారం ఢిల్లీలో ఘనంగా జరిగింది.
కార్యక్రమంలో ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ(Rahul Gandhi), కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీతోపాటు మాజీ ఉప రాష్ట్రపతి హమీద్ అన్సారీ, లోక్‌సభ మాజీ స్పీకర్ మీరా కుమార్, తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Telangana CM Revanth Reddy), తమిళనాడు సీఎం విజయ్, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు. పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సోనియాగాంధీ తన కూతురు ప్రియాంక గాంధీని ఆలింగనం చేసుకొని భావోద్వేగానికి గురయ్యారు.
ఈ సందర్భంగా సోనియాగాంధీ తన ఆత్మకథను ఎందుకు రాయాల్సి వచ్చిందో సభికులకు తెలిపారు. ‘మన చుట్టూ ఎన్నో కథలు అల్లుతారు. మనసుకు గాయమయ్యేలా ఆ అబద్ధాలనే ప్రచారం చేస్తారు. నా కుటుంబం విషయంలోనూ అదే జరిగింది. అందుకే నేను ఆత్మకథను రాయాల్సి వచ్చింది. అవాస్తవాలకు సమాధానం చెప్పేందుకు వాస్తవాలను ఇందులో పొందుపరిచాను. నా కథను కూడా ప్రజలు వినేందుకు సిద్ధంగా ఉంటారని భావించాను. ఇప్పుడు జనం స్పందన చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది’ అని ఆమె వివరించారు.
ఆ రోజు నాన్న రిటర్న్ టికెట్ ఇచ్చారు
ఆత్మకథకు ‘బిలాంగింగ్’ అని పేరు పెట్టడానికి గల కారణాన్ని కూడా సోనియాగాంధీ తెలిపారు. ‘మనం ఒక కొత్త ప్రదేశానికి వెళ్లినప్పుడు అక్కడివారిలో ఒకరిగా లేమనే భావన కలగడం సహజం. అలా బయటి వ్యక్తిగా ప్రయాణం మొదలై.. క్రమంగా కుటుంబంలో ఒకరిగా గుర్తింపు పొందడం, చివరికి ఆ కుటుంబంలో భాగం కావడమే ఈ శీర్షిక వెనుక ఉన్న ఉద్దేశం’ అన్నారు. పెళ్లయిన తర్వాత అత్తగారింట్లో సర్దుకుపోవడంలో భారతీయ మహిళలు ఎదుర్కొనే ఇబ్బందులను తాను కూడా ఎదుర్కొన్నానని తెలిపారు.
‘భారత్‌లో చాలా మంది అమ్మాయిలు పెళ్లియిన తర్వాత అత్తగారింట్లో అడుగుపెట్టాక అక్కడి పద్ధతులు, అలవాట్లకు తగ్గట్టు మారాల్సి వస్తుంది. నేను పూర్తిగా భిన్నమైన సామాజిక, సాంస్కృతిక వాతావరణం నుంచి రావడంతో నాకు అది మరింత కష్టంగా అనిపించింది. కానీ, క్రమంగా అంతా అలవాటు పడింది’ అని సోనియాగాంధీ తన పెళ్లినాటి రోజులను గుర్తుచేసుకున్నారు. పుస్తకానికి ప్రజల నుంచి వస్తున్న స్పందనకు ఆనందంగా ఉందని, కొందరు చేస్తున్న విమర్శలు మాత్రం బాధకలిగిస్తున్నాయని ఆమె అన్నారు.
‘రాజీవ్ గాంధీతో నాకు కేంబ్రిడ్జిలో ఓ ఫ్రెండ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అలా ఇద్దరి మధ్య ప్రేమ చిగురించి.. బలపడింది. మా నాన్న చాలా కఠినంగా ఉండేవారు. రాజీవ్‌తో నా పెండ్లి జరగకపోతే తిరిగి వచ్చేసేందుకు ముందుగానే ఆయన రిటర్న్ టికెట్ కూడా ఇచ్చారు. కానీ, నేను అప్పుడు తిరిగి వెళ్లలేదు. ఎందుకో మీ అందరికీ తెలిసిందే’ అని సోనియాగాంధీ పేర్కొన్నారు. ‘బిలాంగింగ్: ఏ జర్నీ ఆఫ్ లవ్’ పుస్తకం ఈ నెల 10న మార్కెట్‌లోకి వచ్చింది. రాజీవ్ గాంధీతో ప్రేమ, పెళ్లి.. అత్తమ్మ ఇందిరాగాంధీతో ఆత్మీయత.. ఎమర్జెన్సీ.. యూపీఏ హయాంలో తీసుకున్న నిర్ణయాలు సహా ఎన్నో అంశాలను ఇందులో సోనియాగాంధీ ప్రస్తావించారు. ఐదారురోజుల్లోనే రెండు లక్షలకు పైగా ప్రతులు అమ్ముడయ్యాయి.
ఆ ఒక్కసారే అమ్మానాన్న గొడవపడ్డారు: రాహుల్
అమ్మానాన్న సోనియాగాంధీ, రాజీవ్‌గాంధీ గొడవపడటం తాను, చెల్లి ప్రియాంకగాంధీ ఒక్కసారి మాత్రమే చూశామని పుస్తకావిష్కరణ వేదికగా రాహుల్ గాంధీ గుర్తుచేసుకున్నారు. ఇంట్లో తామందరం కలిసి భోజనం చేసేవాళ్లమని, భోజనం టైమ్‌కు నాన్న తమతో తప్పక ఉండేవారని తెలిపారు. నాన్న ఒడిలో అమ్మ కూర్చునే సందర్భాన్ని చూస్తుంటే తమకు సాధారణ విషయంలా అనిపించేదని ఆయన అన్నారు. “ఓసారి నాన్న రాజీవ్‌గాంధీ.. అప్పటి కెప్టెన్ అమరీందర్ సింగ్‌తో ఏదో ఫోన్‌లో మాట్లాడుతున్నారు.
అదే సమయంలో అమ్మ వచ్చి నాన్నతో ఏదో చెప్పబోయింది. నాన్న ఫోన్‌లో మాట్లాడుతుండగా అమ్మ రెండు మూడుసార్లు అదే విషయం చెప్పబోయింది. దీంతో నాన్న కాస్త చిరాకుపడ్డారు. అదే నేను, ప్రియాంక చూసి అమ్మానాన్నల మధ్య ఏకైక గొడవ. అమ్మానాన్న ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. నాన్న ఒడిలో అమ్మ కూర్చోవడం చూసి సాధరణంగా భావించేవాళ్లం. ఒకసారి మా స్నేహితుడ్ని.. ‘మీ అమ్మ మీ నాన్న ఒడిలో ఎందుకు కూర్చోవడం లేదు?’ అని అడిగేశాను” అని రాహుల్ గుర్తుచేసుకున్నారు.
నాన్నమ్మ ఇందిరాగాంధీ, నాన్న రాజీవ్‌గాంధీ హత్యలు తమ కుటుంబ జీవితాన్ని ఛిన్నాభిన్నం చేశాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ‘నాన్న మరణంతో అమ్మ చాలా కుంగిపోయారు. వారిద్దరూ ఎంతో ప్రేమగా ఉండేవాళ్లు. ఒక్కసారిగా తన తోడు వెళ్లిపోవడంతో అప్పటివరకు సరదాగా నవ్వుతూ కనిపించే అమ్మ ఒంటరైపోయింది. ఆమె జీవితంలో వెలుగు ఆరిపోయింది’ అంటూ రాహుల్ భావోద్వేగానికి లోనయ్యారు.