భారత్‌కు ‘నివారణ రాష్ట్రం’గా తెలంగాణ!

09-10-2026 | 05:10am

తెలంగాణ(Telangana) సత్తాను చాటుతున్న అవకాశాలు, గణాంకాలు ఆస్పత్రి వద్ద కాదు.. అంతకు ముందే ఆరోగ్య సంస్కరణ మొదలవ్వాలి సంగారెడ్డి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన 48 ఏళ్ల ఆటోరిక్షా డ్రైవర్ ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించిన రోజే.. అతని భవిష్యత్తును మార్చే కీల కమైన రోజుగా మారి ఉండేది. అతని రక్తంలో చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉన్నాయి. రక్తపోటు కూడా అధికంగానే ఉంది.

వైద్యులు మందులు ఇచ్చి, మళ్లీ పరీక్ష కోసం రావాలని సూచించారు. కానీ ఆ తదుపరి పరీక్షకు అతను ఎప్పుడూ రాలేదు. కారణం.. దేశంలోని కోట్లాది మంది శ్రామికులకు తెలిసిందే. దూర ప్రయాణం చేయాల్సి రావడం.. మళ్లీ ఒకరోజు రావాలంటే ఆ రోజు సంపాదన కోల్పోవడం.. అన్నింటికంటే ముఖ్యంగా ఎలాంటి నొప్పి, లక్షణాలు గానీ కనిపించకపోవడం వల్ల తిరిగి ఆసుపత్రికి వెళ్లాలని, అది అత్యవసరం అనిపించకపోవడం. మందులు అయిపోయిన తర్వాత గుర్తు చేసేవారు ఎవరూ లేరు. ఆరోగ్య కార్యకర్త కూడా అతని ఇంటి తలుపు తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత దీని పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు.

మధుమే హం, అధిక రక్తపోటు ప్రత్యేకించి రెండూ కలిసి ఉన్నప్పుడు దీర్ఘకాలిక మూత్రపిండాల వ్యాధి, చివరకు కిడ్నీ వైఫల్యానికి ప్రధాన కారణంగా మారుతున్నాయి. ఆ దశకు చేరు కున్న తర్వాత రోగికి వారానికి మూడుసార్లు, ఒక్కోసారి దాదాపు ౪ గం టల పాటు హీమో డయాలసిస్ అవసరం కావచ్చు. రోజంతా ఆటో నడపడం వల్ల వారానికి మూడుసార్లు డయాలసిస్ కోసం ఆసుపత్రికి రావడం అనేది సదరు ఆటో డ్రైవర్‌కు సాధ్యం కాకపోవచ్చు. ఫలితంగా కుటుంబ ఆదాయం పడిపోతుంది.

వైద్య ఖర్చులు పెరుగుతాయి. ప్రభుత్వం డయాలసిస్ ఖర్చును భరించవచ్చు. కానీ, అంతకంటే ముందే నివారించడం చాలా తక్కువ ఖర్చుతో కూ డుకున్నది. తెలంగాణ ఆరోగ్య వ్యవస్థ ముందున్న అసలు సవాలిదే. స్క్రీనింగ్ టేబుల్ వద్ద గుర్తించిన రోగి ఆసుపత్రి బెడ్‌పై చేరేంతవరకు మధ్య లో ఎక్కడా కనుమరుగు కాకుండా ఎలా చూసుకోవాలి? తెలంగాణ ఇప్పటికే అనేక వ్యవస్థలను నిర్మించింది. ఈ విషయంలో తెలంగాణ జీరో నుంచి ప్రారంభించాల్సిన అవసరం లేదు. నివారణాత్మక ఆరోగ్య సంరక్షణకు అవసరమైన అనేక కీలక వ్యవస్థలను ఇప్పటికే రాష్ట్రం నిర్మించింది.

రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా అర్హత కలిగిన కుటుంబాలకు నగ దు రహిత వైద్య చికిత్స అందుతోంది. 2023 డిసెంబర్‌లో ఈ పథకం కింద కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచి 1,835 రకాల వైద్య ప్రక్రియలను చేర్చారు. బస్తీ, పల్లె దవాఖానాలు వైద్య సంప్రదింపులు, మందులు, నిర్ధారణ పరీక్షలు, అలాగే అసాంక్రమిక వ్యాధుల స్క్రీ నింగ్ సేవలందిస్తున్నాయి. తెలంగాణ డయాగ్నస్టిక్స్ ద్వారా ఉచిత పరీక్షలు కూడా అందుబాటులో ఉన్నాయి. 

2026 మార్చిలో సంగారెడ్డి జిల్లాలోని 64 ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో డిజిటల్ హెల్త్ ప్రొఫైల్‌ను ప్రయోగాత్మకంగా ప్రా రంభించారు. దీని ద్వారా ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలోని వివిధ స్థాయిల్లో రోగుల వైద్య రికార్డులను అనుసంధానించే ప్రయత్నం జరుగుతోంది. అయితే డిజిటల్ రికార్డు ఒక్కటే సరిపోదు. అది అమలుకు దారితీసినప్పుడే దానికి ప్రయోజనం ఉంటుంది.

గణాంకాల్లో హెచ్చరిక..

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ గణాంకాలు తెలంగా ణకు ఒకవైపు ప్రోత్సాహాన్ని, మరోవైపు హెచ్చరికలను జారీచేస్తున్నాయి. ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ నుంచి ఎన్‌ఎఫ్‌హెచ్‌ఎస్ మధ్యకాలంలో అధిక రక్తపోటు ఉన్నవారు, దాని కోసం మందులు వాడుతున్న మహిళల శాతం 26.1 శాతం నుంచి 24.2 శాతానికికి తగ్గింది. పురుషుల్లో ఇది 31.4 శాతం నుంచి 28.2 శాతానికి పడిపోయిం ది. అయితే మధుమేహం పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. రక్తంలో అధిక, అత్యధిక చక్కెర స్థాయిలున్నా.. మధుమేహానికి మం దులు వాడుతున్న మహిళల శాతం 14.7 నుంచి 19.6శాతానికి పెరిగింది.

పురుషుల్లో ఇది 18.1 శాతం నుంచి 24.5 శాతానికి  చేరింది. అంటే దాదాపు ప్రతి నలు గురు పురుషుల్లో ఒకరున్నారని అర్థం. ఊబకాయం కూడా పెరుగుతోంది. 15 నుంచి -49 ఏళ్ల మహిళల్లో అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారి శాతం 30.1 నుంచి 36.3కు పెరిగింది. పురుషుల్లో ఇది 32.4 నుంచి 35.5 శాతానికి చేరింది. ఇవి కేవలం ఆరోగ్యనివేదికల్లో కనిపించే గణాం కాలు కావు. భవిష్యత్తులో కిడ్నీ వ్యాధులు, గుండెపోటులు, పక్షవాతం, ఇతర అధిక వ్యయంతో కూడిన ఆరోగ్య సమస్యలను సూచించే ముందస్తు హెచ్చరికలు.

చికిత్స కంటే.. నివారణే చౌక

దీనికి ఆర్థిక కోణం కూడా అంతే బలం గా ఉంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆధ్వర్యంలోని ఇండియా హైపర్ టెన్షన్ కంట్రోల్ ఇనిషియేటివ్ ప్రకారం.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో అధిక రక్తపోటుకు నిర్దిష్టమైన చికిత్స అందించడానికి ఒక్కో రోగికి ఏడాదికి సుమారు రూ.200 మాత్రమే ఖర్చు కావచ్చు. మరో అధ్యయ నం ప్రకారం, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర స్థాయిలో అధిక రక్తపోటు చికిత్సకు నెలకు ప్రత్యక్షంగా అయ్యే ఖర్చు సుమారు రూ. 223గా అంచనా వేశారు. డయాలసిస్ పరిస్థితి పూర్తిగా భిన్నం.

ఒక అధ్యయనం ప్రకా రం, హీమోడయాలసిస్‌కు ఒక్కో రోగిపై ఏడాదికి ప్రత్యక్షంగా సుమారు రూ.3.32 లక్షలు ఖర్చవుతాయి. సమస్యలు లేని రోగికి పరోక్ష ఖర్చులు మరో రూ.41,743 వరకు ఉండవచ్చు. జాతీయ డయాలసిస్ కార్యక్రమం ప్రకారం, భారత్‌లో ఏటా సు మారు 2.2 లక్షల కిడ్నీ వ్యాధి కేసులు (చివరి దశలో ఉన్నవి) కొత్తగా నమోదవు తున్నాయి. ఏటాదాదాపు 3.4 కోట్ల డ యాలసిస్ సెషన్ల అవసరం ఏర్పడుతోంది. అయితే, వ్యాధి సంక్షోభంగా మారకముం దే జోక్యం చేసుకోవడమే చౌకైన మార్గం.

లోపిస్తున్న అనుసంధానం.. 

ఫాలో-అప్ 

తమిళనాడులోని ‘మక్కలై తేడి మరుత్తువం’ కార్యక్రమం ద్వారా స్క్రీనింగ్, మం దులు, దీర్ఘకాలిక వ్యాధుల నిరంతర చికిత్స సేవలను ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి అందిస్తున్నారు. 2024 ఆగస్టు నాటికి ఈ కార్యక్ర మం ద్వారా 1.86కోట్ల మందికి పైగా ప్ర యోజనం పొందారు. 2024లో ఐక్యరాజ్యసమితి ఇంటర్- ఏజెన్సీ టాస్క్‌ఫోర్స్ అవార్డును కూడా ఈ కార్యక్రమం అందుకుంది. కేరళలోని షైలీ యాప్ కుటుంబ స్థాయిలో ఆరోగ్య స్క్రీనింగ్‌కు తోడ్పడుతోంది. అక్కడి ఈ-హెల్త్ వ్యవస్థ వైద్య రికా ర్డులు, సమ్మతిని అనుసంధానిస్తోంది.

తెలంగాణ ఈ రెండు విధానాలనూ కలిపి అమలు చేయవచ్చు. వ్యక్తిగత స్థాయి లో నిరంతర ఫాలో-అప్, డిజిటల్‌గా అనుసంధానమైన ఆరోగ్య సంరక్షణకు ఐదు మార్పులు కీలకమైన ఫలితాలను తీసుకురాగలవు.

మొదటిది.. తెలంగాణ కేవలం ఎంతమందిని స్క్రీనింగ్ చేశామనే సంఖ్యలకే పరిమితం కాకుండా, జిల్లాల వారీగా రక్తపోటు, మధుమేహ నియంత్రణకు స్పష్ట మైన లక్ష్యాలను ప్రకటించాలి.

రెండవది.. దీర్ఘకాలిక వ్యాధి నిర్ధారణ అయిన ప్రతి వ్యక్తిని ఒక నిర్దిష్ట ఆరోగ్య బృందానికి అనుసంధానించాలి. మందు ల రీఫిల్స్, పునఃపరీక్షలు, ఫాలో-అప్ ఫోన్ కాల్స్, అవసరమైతే ఇంటి సందర్శనలు.. వీటికీ ఆ బృందమే బాధ్యత వహించాలి.


మూడవది.. వ్యాధిని గుర్తించినందుకు మాత్రమే కాకుండా, రోగుల రక్తపోటు, రక్తంలో చక్కెర స్థాయులను నియంత్రణ లో ఉంచినందుకు కూడా ఆరోగ్య కేంద్రాలను ప్రోత్సహించాలి.

నాలుగవది.. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ వ్యవస్థకు పునాది విశ్వాసం కావాలి. ప్రజ లు తమ ఆరోగ్య రికార్డులను స్వయంగా చూడగలగాలి. వాటిని ఎవరు యాక్సెస్ చేయగలరో స్పష్టంగా తెలుసుకునే అవకా శం ఉండాలి. తమ సమ్మతిని వెనక్కి తీసుకునే హక్కు కూడా వారికి ఉండాలి. భారత  డిజిటల్ హెల్త్ వ్యవస్థ ఇప్పటికే సమాచా రం ఆధారిత, స్వచ్ఛంద సమ్మతి మరియు గోప్యతకు ప్రాధాన్యం ఇస్తోంది.

చివరగా.. నివారణను ఎంతమందికి చికిత్స అందించామనే దానితో కాకుండా, ఎంతమంది డయాలసిస్, గుండె శస్త్రచికిత్స, పక్షవాతం చికిత్స, ఇతర అధిక వ్య య ఆసుపత్రి సేవల దశకు వెళ్లకుండా నివారించగలిగామనే దానితో కొలవాలి.


ఆరోగ్యశ్రీ అవసరమే. ఆసుపత్రులు కూడా ఎప్పటికీ అవసరమే. అయితే ప్రజ లు తీవ్ర అనారోగ్యానికి గురైన తర్వాత వారిని ఎంత సమర్థంగా చికిత్స చేశామనే ఒక్క అంశంతోనే ఆరోగ్య వ్యవస్థను అం చనా వేయలేం. తెలంగాణ ముందు ఇప్పు డు మరింత పెద్ద లక్ష్యాన్ని సాధించగలిగే అవకాశం ఉంది. రాష్ట్ర తదుపరి ప్రధాన ఆరోగ్య సంస్కరణ ఆపరేషన్ థియేటర్లో ప్రారంభం కాకూడదు. మందులు అయిపోయిన ఆ ఆటో డ్రైవర్‌కు వచ్చే ఒక ఫోన్ కాల్‌తో అది ప్రారంభం కావాలి.

(డా.ఎం.వామన్‌రావు, ఎం.ఎస్, పీహెచ్‌డీ.బోస్టన్‌లో నివసిస్తున్న శాస్త్రవేత్త, పారి శ్రామికవేత్త, ఆవిష్కర్త, పెట్టుబడిదారు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్‌లో డాక్టోరల్ పరిశోధనలో కొత్త తరహా ముపిరో సిన్ సంశ్లేషణ ప్రక్రియను అభివృద్ధి చేశా రు. కింగ్స్ కాలేజీ, లండన్‌లో జన్యు సంశ్లేషణ రంగంలో మార్గదర్శక పరిశోధనలు చేపట్టారు. తరువాత మానవ జీనోమ్ ప్రాజెక్ట్‌కు సాయపడిన ప్రపంచ స్థాయి జీన్ సింథసిస్, సీక్వెన్సింగ్ సంస్థకు నాయకత్వం వహించి, దాని ఎగ్జిట్‌కు ముందు కీలక పాత్ర పోషించారు)

డా. ఎం. వామన్‌రావు

మరిన్ని వార్తలు