కూరగాయల సాగు పెంపునకు కృషి

11-09-2026 | 04:35am

ఇతర రాష్ట్రాలకు ఎగుమతయ్యేలా కార్యాచరణ

యాసంగిలో లక్ష ఎకరాల్లో సాగుకు ప్రణాళిక

అసెంబ్లీలో వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల

హైదరాబాద్, సెప్టెంబర్ 10 (విజయక్రాంతి): తెలంగాణలో తగ్గుతున్న కూరగాయల సాగు(Vegetable Cultivation) విస్తీర్ణం పెంచేందుకు కృషి చేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు(Minister Tummala Nageswara Rao) పేర్కొన్నారు. రైతులకు ఆధునిక సాంకేతికత అందిస్తామన్నారు. నాణ్యమైన ఇన్‌పుట్స్, సాగునీటి సదుపాయాలు, శిక్షణ, ప్రాసెసింగ్, కోల్డ్ స్టోరేజ్, మార్కెటింగ్ వంటి వసతులు కల్పిస్తామన్నారు.

అసెంబ్లీలో పలువురు సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి తుమ్మల సమాధానమించారు. ఈ వానాకాలంలో 51వేల ఎకరాల్లో కూరగాయల సాగు లక్ష్యం కాగా, 72,583 ఎకరాల్లో సాగు జరిగిందన్నారు. ఈ ఆర్థిక సంవత్సరానికి కూరగాయలనారు, మల్చింగ్, షేడ్‌నెట్ కోసం రూ.20 కోట్లు, శాశ్వత పందిళ్ల కోసం రూ.8 కోట్లు, బిందు సేద్యం కోసం రూ.97 కోట్లు కేటాయించినట్లు వెల్లడించారు. యాసంగిలో లక్ష ఎకరాల్లో కూరగాయల సాగుపై దృష్టి పెట్టినట్లు తెలిపారు.  తెలంగాణలో పండిన కూరగాయలు ఇతర రాష్ట్రాలకు వెళ్లే స్థాయికి ఉత్పత్తిని పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు మంత్రి వెల్లడించారు.

అందుకు అ నుగుణంగా వ్యవసాయ విద్యలో నాణ్యతను పెంచేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. యూరియా వినియోగం పెరగడం వల్ల పురుగు మందుల వినియోగం కూడా పెరుగుతోందని మంత్రి తెలిపారు. యూరియా వినియోగాన్ని సమతుల్యం చేసేలా, భూమిని సంరక్షించే ఎరువులకు ప్రాధాన్యతనిచ్చే విధంగా సబ్సిడీ విధానాన్ని మార్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నట్లు చెప్పారు. ఈ అంశంపై ప్రధానమంత్రి, కేంద్ర వ్యవసాయ మంత్రితో పలుమార్లు చర్చించినట్లు వెల్లడించారు.

దక్షిణ భారత రాష్ట్రాల వ్యవసాయ మంత్రులతో ఈ నెల 18న సమావేశం నిర్వహించేందుకు కేంద్ర వ్యవసాయ ఆహ్వానించినట్టు తెలిపారు. వ్యవసాయ విద్యలో నాణ్యతను పెంచేందుకు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటోందని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని 11 ప్రైవేట్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రమాణాలు పాటించని 6 కళాశాలల అనుబంధాన్ని రద్దు చేసినట్లు వెల్లడించారు. గతంలో వ్యవసాయ విద్యలో సుమా రు 1,100 సీట్ల సామర్థ్యం ఉండగా, ప్రస్తుతం దాన్ని 2వేల సీట్లకు పెంచగలిగామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు