హైదరాబాద్ సంస్థానం విమోచన పోరు గర్వకారణం
- విముక్తి పోరాట చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాలి
- మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ
- సర్దార్ పటేల్ చొరవతోనే విమోచనం
- బీజేపీ రాష్ట్ర చీఫ్ రాంచందర్‌రావు
- చరిత్ర లేకుండా వర్తమానం లేదు: ఎంపీ ఈటల
- పరేడ్ గ్రౌండ్స్‌లో ఛాయాచిత్ర ప్రదర్శన ప్రారంభం
సికింద్రాబాద్, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): నిజాం నిరంకుశ పాలన(Nizam autocratic rule)కు వ్యతి రేకంగా జరిగిన పోరాటంలో ఎందరో మహనీయులు త్యాగాలు, బలిదానాలు చేశారని, వారి చరిత్రను పాఠ్య పుస్తకాల్లో చేర్చాల్సిన అవసరం ఉందని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ(Bandaru Dattatreya) పేర్కొన్నారు. హైదరాబాద్ సంస్థానం(Hyderabad State) భారతదేశం(India)లో విలీనమై, ఇక్కడి ప్రజలు స్వేచ్ఛను పొందిన సెప్టెంబర్ 17వ తేదీ ప్రాధాన్యతను, చారిత్రక నేపథ్యాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి అధికారికంగా హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని నిర్వహి స్తుండటం హర్షణీయమని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం సైతం ఈ వేడుకలను అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు. హైదరాబాద్ విమోచన దినోత్సవ వేడుకల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్(Central Bureau of Communication) (సీబీసీ) రెండు రోజుల ఫొటో ప్రదర్శనను ఏర్పాటు చేసింది.
హైదరాబాద్ సంస్థానంలో ప్రజలపై జరిగిన దమనకాండ, నిజాం వ్యతిరేక పోరాటంలో సమరయోధుల పాత్ర, భారతదేశంలో హైదరాబాద్ సంస్థానం విలీనం వరకు జరిగిన ప్రధాన సంఘటనలను వివరిస్తూ ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనను బుధవారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు, మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్(Etela Rajender)తో కలిసి బండారు దత్తాత్రేయ ప్రారంభించారు.
హైదరాబాద్ విముక్తి కోసం వీరోచితంగా పోరాడిన వారి చరిత్ర, త్యాగాలను వివరిస్తూ ప్రదర్శనను ఏర్పాటు చేసిన సీబీసీని అభినందించారు. ఈ ప్రదర్శనను ప్రతి విద్యార్థి తప్పక చూడాలని బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. హైదరాబాద్ విముక్తి పోరాటాన్ని గుర్తుచేస్తూ, నిజాం అరాచక పాలనకు వ్యతిరేకంగా ప్రజలంతా కులమతాలకు అతీతంగా పోరాడారని బండారు దత్తాత్రేయ అన్నారు. ప్రజల వేషభాషలు, సంస్కృతి, సంప్రదాయాలపై నిజాం సాగించిన అణచివేతకు వ్యతిరేకంగా పోరాడిన యోధుల చరిత్ర పట్ల మనమంతా గర్వపడాలని దత్తాత్రేయ పేర్కొన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు మాట్లాడుతూ.. హైదరాబాద్ విమోచన చరిత్ర, నిజాంకు వ్యతిరేకంగా జరిగిన పోరాటం, సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతో హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం కావడం, నిజాం లొంగుబాటు వంటి చారిత్రక అంశాల గురించి నేటి తరానికి తెలియాల్సిన అవసరం ఉందని అన్నారు. మన భవిష్యత్తుకు మన చరిత్రే పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. వందేమాతరం నినాదం చేసినందుకు జైలులో పెట్టడం, త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసినందుకు కాల్చి చంపడం వంటి దారుణ ఘటనలు నిజాం పాలనలో చోటుచేసుకున్నాయని గుర్తుచేశారు.
హైదరాబాద్ ప్రజలు ఇప్పుడు అనుభవిస్తున్న స్వేచ్ఛ, గౌరవం వెనుక ఎన్నో త్యాగాలు, బలిదానాలు ఉన్నాయని అన్నారు. త్యాగాలతో కూడిన ఈ పోరాట చరిత్ర తరతరాలకు అందాలని, రాంజీ గోండు, దొడ్డి కొమురయ్య, చాకలి ఐలమ్మ వంటి వీరుల త్యాగాలను నేటి తరం విద్యార్థులు, యువత గుర్తుంచుకోవాలని అన్నారు.
సీబీసీ, పీఐబీ అదనపు డైరెక్టర్ జనరల్ శ్రుతి పాటిల్ ప్రారంభోపన్యాసం చేస్తూ, హైదరాబాద్ విమోచన దినోత్సవ చరిత్రను నేటి తరానికి తెలియజేసేందుకు ఏర్పాటు చేసిన ఫొటో ప్రదర్శన ప్రాధాన్యతను, విశేషాలను వివరించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సమీర్ నందా, డైరెక్టర్ రాజీవ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే చింతల రాంచంద్రారెడ్డి, సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోర్డు నామినేటెడ్ సభ్యురాలు భానుక నర్మద మల్లికార్జున్, పీ ఎల్ శ్రీనివాస్ పాల్గొన్నారు.
పటేల్ చిత్రపటాలను ప్రతి ఇంట్లో ఏర్పాటు చేయాలి..
ముషీరాబాద్: నిజాం రజాకారుల ధమన కాండను నాశనం చేసి తెలంగాణకు విమోచన కలిగించిన సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటాలను తెలంగాణలోని ప్రతి ఇంట్లో ఏర్పాటు చేయాలని మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. పటేల్ చిత్రపటాలను ప్రతి ఇంట్లో ఏర్పాటు చేసుకున్నప్పుడే ఆయనకు మనమిచ్చే ఘనమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు. బుధవారం బషీర్‌బాగ్ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ, ప్రొఫెషనల్ సెల్ ఆధ్వర్యంలో ‘17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవ ప్రాముఖ్యత‘ అనే అంశంపై తెలంగాణ యువ మాక్ విధాన సభను నిర్వహించారు.
ఈ సందర్భంగా బండారు దత్తాత్రేయ హాజరై మాట్లాడుతూ.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కర్ణాటక, మహారాష్ట్ర ప్రభుత్వాలు అధికారికంగా నిర్వహిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం నిర్లక్ష్యం చేస్తుందని ధ్వజమెత్తారు. చరిత్రను వక్రీకరించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం రకరకాల కుట్రలు చేస్తుందని మండిపడ్డారు. తెలంగాణ చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత నేటి తరంపై ఉన్నదన్నారు. చరిత్రను విమర్శించినటువంటి జాతి అది ప్రపంచంలో ఎక్కడ గుర్తింపు ఉండదని, దానికి ఉదాహరణ ఇజ్రాయిల్ అని పేర్కొన్నారు. తెలుగు భాషను, హిందూ సమాజాన్ని అణచడానికి నిజాం సర్కార్ ప్రయత్నం చేసిందన్నారు.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం సెప్టెంబర్ 17న తెలంగాణ విమోచన దినంగా అధికారికంగా గుర్తిస్తామని చెప్పి, సమైక్య పాలనని చెప్పిందని, నేడు అదే బాటలో సీఎం రేవంత్‌రెడ్డి ఇది సమైక్య పాలన కాదు, మాది ప్రజా పాలన అని చెప్పి తెలంగాణ విమోచన దినాన్ని మరిచిందని ఆరోపించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్, బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు, తెలంగాణ విమోచన దినోత్సవ కమిటీ, ప్రొఫెషనల్ సెల్ ప్రతినిధులు అశోక్, సుమన్, గౌతమ్ పాల్గొన్నారు.