అనారోగ్యంతో వ్యక్తి మృతి

29-09-2026 | 10:52pm

మల్లాపూర్, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): అనారోగ్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మల్లాపూర్ మండలం(Mallapur Mandal) ధర్మారం గ్రామంలో సోమవారం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరు జిల్లా ఇంజమూరు మండలం వేంకటాద్రిపాలెం గ్రామానికి చెందిన పాషం వెంకటేశ్వర్లు (48) గత రెండు నెలలుగా ధర్మారం గ్రామానికి చెందిన గజ్జెల చంద్రశేఖర్ వద్ద పనిచేస్తూ అక్కడే నివాసం ఉంటున్నాడు.

సోమవారం ఉదయం సుమారు 9 గంటల సమయంలో ధర్మారం గ్రామ బస్టాండ్ వద్ద వెంకటేశ్వర్లు వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. విషయం తెలుసుకున్న చంద్రశేఖర్ వెంటనే అతడిని స్థానిక ఆర్‌ఎంపీ వద్దకు తీసుకెళ్లి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కోరుట్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ వెంకటేశ్వర్లు మృతి చెందాడు.

వెంకటేశ్వర్లు సుమారు పదిహేను ఏళ్ల క్రితం భార్య లక్ష్మమ్మతో విడాకులు తీసుకున్న అనంతరం ఒంటరిగా జీవిస్తున్నాడని, మద్యపానానికి అలవాటు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. సంఘటన జరిగిన రోజు కూడా మద్యం సేవించిన అనంతరం బస్టాండ్ వద్ద వాంతులు చేసుకుని అపస్మారక స్థితిలోకి వెళ్లినట్లు పేర్కొన్నారు.మృతుడి కుటుంబ సభ్యులకు ఎలాంటి అనుమానం లేదని ఫిర్యాదుదారు పాషం సిసింద్రీ పోలీసులకు తెలిపినట్లు సమాచారం. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మల్లాపూర్ పోలీస్ స్టేషన్ ఏఎస్ఐ బి. ప్రకాష్ తెలిపారు.

మరిన్ని వార్తలు