జనగామకు మంత్రి వరాలు
జనగామ,(విజయక్రాంతి): జనగామ జిల్లా(Jangaon District) కేంద్రంలో శనివారం పలు అభివృద్ధి కార్యక్రమాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి(Minister Ponguleti Srinivas Reddy) మున్సిపాలిటీకి చెందిన 16 చెత్త సేకరణ ఆటోలు, ఒక జేసీబీని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్లు, డబుల్ బెడ్ రూం పట్టాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ "రాష్ట్రంలో కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం. తెలంగాణను పూరి గుడిసెలు లేని రాష్ట్రంగా తీర్చిదిద్దుతాం. ప్రతి ఇంటికి 200 యూనిట్ల ఉచిత కరెంటు, పేదలకు సన్న బియ్యం అందిస్తున్నాం. పార్టీలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు(Indiramma houses) ఇస్తాం. రైతును రాజు చేయడమే మా ప్రభుత్వ లక్ష్యం. జనగామ మున్సిపాలిటీ అభివృద్ధికి దసరా పండుగ లోపు రూ.10 కోట్ల నిధులు మంజూరు చేస్తాం" అని అన్నారు.
అనంతరం ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి(MLA Palla Rajeshwar Reddy) మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి నిధులు కేటాయించాలని మంత్రిని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, కాంగ్రెస్ జిల్లా ఇంచార్జ్ కొమ్మూరి ప్రతాప్ రెడ్డి, డీసీసీ అధ్యక్షురాలు లకావత్ ధనవంతి, వైటీడీఏ సభ్యుడు లకావత్ లక్ష్మీనారాయణ, మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్, వైస్ చైర్మన్ బుషా పర్వతాలు, మార్కెట్ చైర్మన్ భాను శివరాజ్ యాదవ్, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.