డ్రగ్స్‌కు దూరంగా ఉంటేనే.. యువత భవితకు భరోసా!
కోనరావుపేట, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి): కోనరావుపేట ప్రభుత్వ జూనియర్ కళాశాలలో(Konaraopet Government Junior College) “నషా ముక్తి యువ ఫర్ వికసిత్ భారత్(Drug-Free Youth for a Developed India)” కార్యక్రమంలో భాగంగా డ్రగ్స్, మద్యం రహిత(Drug and alcohol-free) యువతతోనే అభివృద్ధి చెందిన భారతదేశం సాధ్యమనే అంశంపై అవగాహన కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ ఎస్. రాజయ్య అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథిగా స్థానిక పోలీస్ స్టేషన్ సబ్ఇన్స్పెక్టర్ బి. రామ్మోహన్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎస్ఐ రామ్మోహన్ మాట్లాడుతూ విద్యార్థులు మాదకద్రవ్యాల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండాలని, వాటికి ఎట్టి పరిస్థితుల్లోనూ బానిసలు కావద్దని సూచించారు. డ్రగ్స్ వినియోగం వల్ల శారీరక, మానసిక ఆరోగ్యంతో పాటు సామాజిక, ఆర్థికంగా కూడా తీవ్ర నష్టాలు కలుగుతాయని వివరించారు.
డ్రగ్స్‌కు దూరంగా ఉంటూ ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణంలో యువత భాగస్వాములు కావాలని కోరారు. చెడు వ్యసనాల వైపు వెళ్లకుండా తమ భవిష్యత్తును కాపాడుకోవాలని విద్యార్థులకు సూచించారు.ఈ సందర్బంగా కళాశాల స్టూడెంట్ కౌన్సిలర్ బి. భూమేష్ విద్యార్థులకు డ్రగ్స్‌పై డెమో ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు.మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలు, వాటికి దూరంగా ఉండాల్సిన అవసరాన్ని వివరించారు.ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.