రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
భూ రీ-సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో పూర్తి చేయాలి: అదనపు కలెక్టర్ అశోక్ కుమార్
భూపాలపల్లి/ రేగొండ, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో చేపడుతున్న భూ రీ-సర్వే(Land Resurvey) ద్వారా రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం లభించేలా చర్యలు తీసుకుంటున్నామని అదనపు కలెక్టర్ అశోక్ కుమార్ తెలిపారు. మంగళవారం రేగొండ మండలం లింగాల గ్రామంలో కొనసాగుతున్న భూ రీ-సర్వే ప్రక్రియను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
రీ-సర్వేను పారదర్శకంగా, ఖచ్చితత్వంతో నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. భూ సరిహద్దుల నిర్ధారణలో రైతుల భాగస్వామ్యం ఉండేలా చూడాలని సూచించారు. ఈ సందర్భంగా రైతులతో మాట్లాడి వారి సందేహాలను నివృత్తి చేశారు. రీ-సర్వే ద్వారా తమ భూముల సరిహద్దులు, వివరాలను పరిశీలించుకోవాలని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే అధికారుల దృష్టికి తీసుకురావాలని సూచించారు.
రైతులందరూ రీ-సర్వే సిబ్బందికి సహకరించి తమ భూముల వివరాలను క్షుణ్ణంగా పరిశీలించుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, తహసీల్దార్ శ్వేత, సర్వే డిప్యూటీ ఇన్‌స్పెక్టర్, మండల సర్వేయర్, రెవెన్యూ, సర్వే సిబ్బంది, రైతులు పాల్గొన్నారు.