విద్యార్థులకు నాణ్యమైన విద్య, మెరుగైన వసతులు కల్పించాలి
- జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
- పీఎం శ్రీ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
- విద్యార్థులతో ముఖాముఖి
గణపురం, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు కల్పించడంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. బుధవారం గణపురం మండల కేంద్రంలోని పీఎం శ్రీ తెలంగాణ మోడల్ స్కూల్, జూనియర్ కళాశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు.
ఈ సందర్భంగా పాఠశాల, కళాశాలలో విద్యాబోధన తీరు, విద్యార్థుల హాజరు, మౌలిక వసతులు, ప్రయోగశాలల నిర్వహణను కలెక్టర్ పరిశీలించారు. వివిధ తరగతి గదులను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. ఉపాధ్యాయుల బోధనా తీరును, విద్యార్థుల అభ్యసన స్థాయిని అడిగి తెలుసుకున్నారు. సైన్స్, గణితం, సాంఘిక శాస్త్రాలతో పాటు హెల్త్‌కేర్, రిటైల్ వంటి వృత్తి విద్యా కోర్సుల తరగతులను పరిశీలించారు.
విద్యార్థుల హాజరు శాతంపై ఆరా తీసిన కలెక్టర్.. అన్ని తరగతుల్లో వంద శాతం హాజరు నమోదయ్యేలా చర్యలు తీసుకోవాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ముఖ గుర్తింపు ఆధారిత హాజరు తప్పనిసరిగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం, వసతి గృహ సౌకర్యాలు, ప్రయోగశాలలను పరిశీలించారు. ఫ్యాన్లు, ట్యూబ్‌లైట్లు తదితర విద్యుత్ పరికరాలు సక్రమంగా పనిచేసేలా చూడాలని, మరమ్మతులు అవసరమైన వాటిని వెంటనే బాగు చేయించాలని సూచించారు.
లక్ష్య సాధనకు క్రమశిక్షణ అవసరం
విద్యార్థులతో ముచ్చటించిన కలెక్టర్ వారి భవిష్యత్ లక్ష్యాలను అడిగి తెలుసుకున్నారు. డాక్టర్లు, నర్సులు తదితర ఉన్నత స్థాయికి చేరుకోవాలనే లక్ష్యంతో క్రమశిక్షణ, పట్టుదలతో చదువుకోవాలని సూచించారు. చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ కనబరచాలని ప్రోత్సహించారు.
విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు మెరుగైన మౌలిక వసతులు అందేలా పాఠశాల ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. ఈ తనిఖీలో తహసీల్దార్ రాజేశ్వరరావు, ప్రిన్సిపాల్ తిరుపతి, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.