కరువు మండలంగా ప్రకటించాలి
భైంసా (విజయ క్రాంతి): నర్సాపూర్ (జి) మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని తహసీల్దార్ కార్యాలయంలో(Tahsildar Office) బుధవారం బీజేపీ నాయకులు(BJP leaders) వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీజేపీ మండల అధ్యక్షుడు బర్కుంట నరేందర్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రతికూల వాతావరణ పరిస్థితులతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న మండలాల జాబితాలో నర్సాపూర్ (జి)కు చోటు కల్పించకపోవడం విచారకరమన్నారు.
ఇప్పటికే వర్షాభావ పరిస్థితులతో ఇబ్బందులు పడుతున్న రైతులకు దేవుని చెరువు కట్ట తెగిపోవడం మరింత నష్టాన్ని కలిగించిందని పేర్కొన్నారు. ఈ చెరువు ద్వారా మండలంలోని ఆరు నుంచి ఏడు గ్రామాల రైతులకు భూగర్భ జలాల రూపంలో నీటి లభ్యతకు ఆధారం ఉండేదని తెలిపారు. చెరువు కట్ట తెగిపోవడంతో నీటి వనరులపై ప్రభావం పడే ప్రమాదం ఉందన్నారు.
రైతుల పరిస్థితిని పరిగణనలోకి తీసుకొని మండలాన్ని వెంటనే కరువు మండలంగా ప్రకటించి, బాధిత రైతులకు ప్రభుత్వం అండగా నిలవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాజేందర్, దత్తూరాం, సవీన్, సుధాకర్, సుదర్శన్‌రెడ్డి, గంగారాం, లక్ష్మణ్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.