యూనియన్ బ్యాంకులో ఒక్కసారిగా కుప్పకూలిన ఫాల్స్‌ సీలింగ్

28-10-2026 | 05:16pm
  1. భయాందోళనతో పరుగులు తీసిన ఖాతాదారులు,సిబ్బంది
  2. పలువురికి స్వల్ప గాయాలు

గణపురం, అక్టోబర్ 28 (విజయ క్రాంతి): గణపురం మండల కేంద్రంలోని యూనియన్ బ్యాంక్ శాఖలో(Union Bank Branch) బుధవారం మధ్యాహ్నం పెను ప్రమాదం తప్పింది. బ్యాంకులో ఖాతాదారులు, సిబ్బంది తమ విధుల్లో నిమగ్నమైన సమయంలో పైకప్పునకు అమర్చిన ఫాల్స్‌ సీలింగ్‌ ఒక్కసారిగా పెద్ద శబ్దంతో కుప్పకూలింది.

దీంతో ఒక్కసారిగా భయాందోళనకు గురైన ఖాతాదారులు, సిబ్బంది కేకలు వేస్తూ బ్యాంకు నుంచి బయటకు పరుగులు తీశారు.బ్యాంకులో నగదు లావాదేవీల కోసం కౌంటర్ల వద్ద ఖాతాదారులు వేచి ఉన్న సమయంలో ఫాల్స్‌ సీలింగ్‌ షీట్లు, సపోర్ట్‌ ఫ్రేములు ఒక్కసారిగా కూలి కౌంటర్లు, ఖాతాదారులు నిల్చున్న ప్రాంతంలో పడిపోయాయి. ఈ ఘటనలో పలువురు ఖాతాదారులకు స్వల్ప గాయాలైనట్లు తెలిసింది. అదృష్టవశాత్తూ ప్రాణనష్టం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

సీలింగ్‌ శకలాలు కంప్యూటర్లు, క్యాష్‌ కౌంటర్లపై పడటంతో బ్యాంకు కార్యకలాపాలు కొంతసేపు స్తంభించిపోయాయి. ఘటనతో బ్యాంకు వద్ద కొద్దిసేపు తీవ్ర గందరగోళం నెలకొంది. భవన నిర్వహణ లోపాల కారణంగానే ఫాల్స్‌ సీలింగ్‌ కూలినట్లు ఖాతాదారులు ఆరోపిస్తున్నారు. భవనాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించి, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా భద్రతా చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. బ్యాంకులో భద్రత ప్రమాణాలు పాటించడం లేదని ఖాతాదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు