పేద విద్యార్థులకు ఉచిత విద్యాబోధన ప్రశంసనీయం
గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్
గణపురం (విజయక్రాంతి): పేద విద్యార్థులకు ఉచిత విద్యాబోధన ప్రశంసనీయమని గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్(Sarpanch Katkuri Radhika Srinivas) అన్నారు. ప్రదం ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో దసరా సెలవులను సద్వినియోగం చేసుకునేలా పేద విద్యార్థిని, విద్యార్థులకు ఉచిత విద్యాబోధనతో పాటు క్రీడలు, చిత్రలేఖనంలో నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ప్రతిభను వెలికితీసేలా ప్రత్యేక శిక్షణ అందించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గణపురం సర్పంచ్ కట్కూరి రాధిక శ్రీనివాస్ హాజరై విద్యార్థిని, విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా విద్యతో పాటు క్రీడలు, కళలపై ఆసక్తి పెంపొందించుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ ఇన్స్ట్రక్టర్ మొబిలైజర్లు మండల సందీప్, మండల కవిత, విశ్రాంత ప్రధానోపాధ్యాయులు దూలం కుమారస్వామి, వార్డు సభ్యులు కోడపాక అనిల్ లు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.