ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి..
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
కాళేశ్వరం పోలీస్‌స్టేషన్‌లో డీఐజీ అంబర్ కిషోర్ ఝా, ఆకస్మిక తనిఖీ
కాళేశ్వరం, సెప్టెంబర్ 29 (విజయక్రాంతి): కాళేశ్వరం పోలీస్‌స్టేషన్(Kaleshwaram Police Station)ను కాళేశ్వరం జోన్-1 డీఐజీ అంబర్ కిషోర్ ఝా, మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌స్టేషన్ పరిసరాలను పరిశీలించి, అధికారులు, సిబ్బంది విధుల నిర్వహణ తీరును సమీక్షించారు. స్టేషన్‌కు సంబంధించిన వివిధ రికార్డులను పరిశీలించారు.
అనంతరం ఎస్‌ఐ, స్టేషన్ రైటర్, సీసీటీఎన్‌ఎస్ రైటర్లతో మాట్లాడి ఆన్‌లైన్‌లో వివరాల నమోదు, రికార్డుల అప్‌లోడ్ ప్రక్రియపై ఆరా తీశారు. పోలీస్‌స్టేషన్ పరిధిలో నమోదవుతున్న నేరాలు, గ్రామాల పరిస్థితి, శాంతిభద్రతలు, స్టేషన్ నిర్వహణ తదితర అంశాలపై వివరాలు తెలుసుకున్నారు.
పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ప్రతి ఫిర్యాదుదారుడితో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, బాధితులు, ప్రజలకు అందించే సేవలపై ప్రత్యేక దృష్టి సారించాలని డీఐజీ సూచించారు. రౌడీషీటర్లు, అనుమానితులపై నిరంతరం నిఘా ఉంచాలని, వారి ఇళ్లను క్రమం తప్పకుండా తనిఖీ చేయాలని ఆదేశించారు. రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలోని పోలీస్‌స్టేషన్ కావడంతో సిబ్బంది ఎల్లవేళలా అప్రమత్తంగా ఉండాలని, ప్రజల భద్రతకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని డీఐజీ అంబర్ కిషోర్ ఝా సూచించారు.