రీ-సర్వే, ఓటర్ల జాబితా ప్రక్రియను వేగవంతం చేయాలి
జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ: చెన్నపూర్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ
భూపాలపల్లి/ (రేగొండ), అక్టోబర్ 15 (విజయ క్రాంతి): భూముల రీ-సర్వే, ఓటర్ల జాబితా ప్రత్యేక సంక్షిప్త సవరణ ప్రక్రియను పారదర్శకంగా, ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ(District Collector Rahul Sharma) అధికారులను ఆదేశించారు. గురువారం గోరికొత్తపల్లి మండలం చెన్నపూర్ గ్రామంలో రీ-సర్వే పనులు, 263వ పోలింగ్ కేంద్రంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని ఆయన పరిశీలించారు.
రీ-సర్వేలో భూముల గుర్తింపు, గ్రామ హద్దులు, చెరువులు, రహదారుల వివరాలను పరిశీలించిన కలెక్టర్ రోజువారీ లక్ష్యాలను నిర్దేశించుకుని పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రతి మండలంలో రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి సర్వేను పూర్తి చేయాలని, సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. రైతు కల్పనతో మాట్లాడి రోజుకు ఎన్ని ఎకరాలు సర్వే చేస్తున్నారో తెలుసుకున్నారు. ఆర్డీఓ పర్యవేక్షణ చేయాలని సూచించారు.
అనంతరం ప్రత్యేక ఓటరు నమోదు కేంద్రాన్ని తనిఖీ చేసి ఇప్పటివరకు వచ్చిన దరఖాస్తులు, కొత్త ఓటర్ల నమోదు, పేర్ల తొలగింపు, మార్పులు, చేర్పుల వివరాలను బీఎల్ఓను అడిగి తెలుసుకున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. 18 ఏళ్లు నిండిన యువతీ యువకులు ఫారం-6 ద్వారా ఓటరుగా నమోదు చేసుకోవాలని తెలిపారు.
శుక్రవారం కూడా అన్ని పోలింగ్ కేంద్రాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఈ పర్యటనలో ఆర్డీఓ హరికృష్ణ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమకుమారి, తహసీల్దార్ హేమ, సర్పంచ్ భిక్షపతి, సర్వే అధికారులు, బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు.