విద్యా ప్రమాణాలు పెంచాలి

15-10-2026 | 05:25pm

నిర్మల్ , అక్టోబర్ 15 ( విజయ క్రాంతి): ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థి విద్యాపరంగా విద్యా ప్రమాణాలు పెంచాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా(District Collector Bhavesh Mishra) ఆదేశించారు. గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో విద్యాశాఖపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఉపాధ్యాయులు, విద్యార్థుల క్రమం తప్పని హాజరుతోనే ప్రభుత్వ విద్యావ్యవస్థ మరింత బలోపేతం అవుతుందని అన్నారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహించే ఉపాధ్యాయులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

విద్యార్థుల్లో నైపుణ్యాలు, విషయ పరిజ్ఞానం, అవగాహన సామర్థ్యాలను పెంపొందించేలా బోధన కొనసాగించాలని సూచించారు. తరచూ పాఠశాలకు గైర్హాజరవుతున్న విద్యార్థులను గుర్తించి, వారి తల్లిదండ్రులతో మాట్లాడి గైర్హాజరుకు గల కారణాలను తెలుసుకోవాలని, వారు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

బోర్డు పరీక్షలకు విద్యార్థులను ఇప్పటి నుంచే స్పష్టమైన ప్రణాళికతో సిద్ధం చేయాలని కలెక్టర్ సూచించారు. నిర్ణీత గడువులోగా సిలబస్‌ను పూర్తి చేసి, ప్రతి సబ్జెక్టును విద్యార్థులు సులభంగా అర్థం చేసుకునే విధంగా బోధించాలని అన్నారు. విద్యార్థుల సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ, పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా విద్యాశాఖ అధికారి దర్శనం భోజన్న, మండల విద్యాధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు