విద్యార్థులు సైబర్ నేరాల పట్ల అవగాహన పెంపొందించుకోవాలి

16-10-2026 | 05:07pm

జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్

భూపాలపల్లి టౌన్, అక్టోబర్ 16 ( విజయక్రాంతి ) : విద్యార్థులు సైబర్ నేరాల(Cybercrimes) పట్ల అవగాహన పెంపొందించుకోవాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(Sirisetti Sankeerth) అన్నారు. జిల్లా కేంద్రంలోని సింగరేణి కమ్యూనిటీ హాలులో శుక్రవారం విద్యార్థులకు(Students) సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలపై(Online scams) అవగాహన కల్పించేందుకు నిర్వహించిన సైబర్ క్రైమ్ – ”ఫ్రాడ్  కా ఫుల్ స్టాప్" కార్యక్రమంలో భాగంగా విద్యార్థులకు సైబర్ భద్రతపై అవగాహన కార్యక్రమంలో ఎస్పీ ముఖ్య అతిధిగా పాల్గొని అవగాహన కల్పించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రస్తుత డిజిటల్ యుగంలో సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థులు ఇంటర్నెట్, సోషల్ మీడియాను బాధ్యతాయుతంగా వినియోగించాలని సూచించారు. అపరిచిత వ్యక్తుల నుంచి వచ్చే లింకులను క్లిక్ చేయవద్దని, ఓటీపీలు, బ్యాంకు ఖాతా వివరాలు, వ్యక్తిగత ఫొటోలు, పాస్‌వర్డ్‌లను ఇతరులతో పంచుకోవద్దని తెలిపారు. ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని, సైబర్ నేరగాళ్లు చెప్పే ఆకర్షణీయమైన ఆఫర్లు, అధిక లాభాల ఆశలకు లోనుకావద్దని హెచ్చరించారు. 

విద్యార్థులు సైబర్ నేరాలపై అవగాహన పెంపొందించుకోవడంతో పాటు తమ కుటుంబ సభ్యులకు, స్నేహితులకు అవగాహన కల్పించాలని సూచించారు. ఎవరైనా సైబర్ ఆర్థిక మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని తెలిపారు. అనంతరం సైబర్ నేరాల పట్ల అవగాహనకు సంబంధించిన గోడ పత్రికలను ఎస్పీ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ నరేష్ కుమార్, భూపాలపల్లి టౌన్ సీఐ శ్రీనివాస్, సైబర్ క్రైమ్ ఎస్సై శ్రీనివాస్, ఆర్ఎస్ఐ శివ కుమార్, పోలీస్ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు