సరస్వతీ దేవి అవతారంలో దర్శనమిచ్చిన అమ్మవారు
దమ్మపేట, అక్టోబర్ 16(విజయ క్రాంతి): మండల కేంద్రం లోని దారా మల్లికార్జునరావు కాంప్లెక్స్ నందు నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో(Sri Devi Sharannavaratri celebrations) భాగంగా శుక్రవారం అమ్మవారు సరస్వతీదేవి అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు. తెల్లని వస్త్రాలు, చేతిలో వీణ, జ్ఞానానికి ప్రతీకగా పుస్తకంతో అమ్మవారు అలంకరించబడగా ఆలయ ప్రాంగణం భక్తిశోభతో వెలిగిపోయింది.
ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు నిర్వహించారు. అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. సరస్వతీ దేవి అనుగ్రహంతో విద్యార్థులకు విద్యాబుద్ధులు, జ్ఞానం, వివేకం కలగాలని భక్తులు ప్రార్థించారు. మూల నక్షత్రం సందర్భంగా బాల బాలికలకు సరస్వతీ పూజలు నిర్వహించారు. కమిటీ సభ్యులు చిన్నారులకు పలకలు, బలపాలు, పెన్నులు అందచేశారు. అనంతరం భక్తులకు ఆలయ నిర్వాహకులు ప్రసాద వితరణ నిర్వహించారు.