కనుమరుగవుతున్న సాంప్రదాయ పూలు
- తగ్గిపోతున్న వృక్షజాతి
- కనిపించని తంగేడు, గునుగు, గుమ్మడి
- గౌరమ్మ కోసం అష్ట కష్టాలు
- పసుపు తోనే గౌరమ్మలను చేసే పరిస్థితి
భూపాలపల్లి, అక్టోబర్ 07 (విజయక్రాంతి): సాంప్రదాయ పూజలు(Traditional Batukamma Flowers) కనుమరుగవుతున్నాయి. వృక్షజాతి అంతరించిపోతుండడంతో బతుకమ్మకు ముఖ్యమైన తంగేడు, గునుగు, గుమ్మడి తదితర పూలు పూర్తిగా కనిపించడం లేదు. దీంతో గౌరమ్మ కోసం అష్ట కష్టాలు పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది పసుపు తోనే గౌరమ్మలను చేసే పరిస్థితి ఉంది.
తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగకు రోజులు దగ్గరపడుతున్న కొద్దీ పూల సందడి కనిపించాల్సి ఉండగా.. సంప్రదాయ పూల కొరత ఆందోళన కలిగిస్తోంది. ఒకప్పుడు గ్రామీణ ప్రాంతాల్లో పొలాల గట్లపై, చెరువుల చుట్టూ, బీడు భూముల్లో విరివిగా కనిపించిన తంగేడు, గునుగు, బంతి, చామంతి తదితర పూలు ప్రస్తుతం క్రమంగా కనుమరుగవుతున్నాయి.పట్టణాలు, గ్రామాల చుట్టుపక్కల పెరుగుతున్న రియల్ ఎస్టేట్ వెంచర్లు, రోడ్ల విస్తరణ,
భూముల వినియోగంలో మార్పులు, చెట్ల నరికివేతతో సహజంగా పెరిగే పూల మొక్కలకు ఆవాసం లేకుండా పోతోంది. గతంలో ఖాళీ ప్రదేశాలు, పొలాల గట్లు, చెరువు కట్టలు, అడవుల్లో కనిపించే తంగేడు, గునుగు పూలు ఇప్పుడు వెతికినా కనిపించని పరిస్థితి నెలకొంది.అటవీ ప్రాంతాల్లో సహజ వృక్ష సంపద తగ్గిపోవడం, విచ్చలవిడిగా చెట్ల నరికివేత, పచ్చదనం తగ్గడం కూడా సంప్రదాయ పూల మొక్కలపై ప్రభావం చూపుతోంది. వాతావరణ మార్పులు, వర్షపాతం తీరులో మార్పులు కూడా సహజంగా పెరిగే మొక్కల మనుగడను దెబ్బతీస్తున్నాయి.
గతంలో ఇంటి చుట్టుపక్కలే పూలను సేకరించి బతుకమ్మను పేర్చుకునే మహిళలు.. ఇప్పుడు మార్కెట్లను ఆశ్రయించాల్సి వస్తోంది. సంప్రదాయ పూలు అందుబాటులో లేకపోవడంతో ఇతర ప్రాంతాల నుంచి తెచ్చే పూలకు డిమాండ్ పెరుగుతోంది. దీంతో బతుకమ్మలో ఉపయోగించే సహజ పూల స్థానాన్ని మార్కెట్‌లో లభించే పూలు క్రమంగా ఆక్రమిస్తున్నాయి.
బతుకమ్మ కేవలం పూల పండుగ మాత్రమే కాదు.. తెలంగాణ ఆడపడుచుల సంస్కృతి, ప్రకృతితో ఉన్న అనుబంధానికి ప్రతీక. అందుకే సంప్రదాయ పూల మొక్కలను గ్రామాలు, చెరువుల కట్టలు, ప్రభుత్వ భూములు, పాఠశాలలు, రహదారుల వెంట పెద్ద ఎత్తున నాటాలని పలువురు కోరుతున్నారు. తంగేడు, గునుగు, గుమ్మడి వంటి స్థానిక పూల మొక్కల సంరక్షణకు ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరం ఉంది.సంప్రదాయ పూలను కాపాడితేనే.. బతుకమ్మ పండుగకు పూర్వ వైభవం వస్తుందని పర్యావరణ ప్రేమికులు పేర్కొంటున్నారు.