సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలి...
- సోషల్ మీడియాలో వ్యక్తిగత వివరాలు పంచుకోవద్దు
- పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా
మంచిర్యాల క్రైమ్, (విజయక్రాంతి): సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని, ముఖ్యంగా యువత సామాజిక మాధ్యమాలను జాగ్రత్తగా వినియోగించాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Police Commissioner Amber Kishore Jha) సూచించారు.
ప్రతి నెల మొదటి బుధవారం నిర్వహించే సైబర్ జాగరుకత దివాష్ లో భాగంగా మంచిర్యాల పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధ వారం విద్యార్థులకు సైబర్ నేరాలు, ఆన్‌లైన్ మోసాలు, సామాజిక మాధ్యమాల వినియోగంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మంచిర్యాల డీసీపీ ఎగ్గడి భాస్కర్ తో కలిసి ఆయన మాట్లాడారు.
సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత వివరాలను బహిర్గతం చేయడం ద్వారా సైబర్ నేరగాళ్లు వాటిని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని హెచ్చరించారు. ప్రస్తుత కాలంలో యువత సామాజిక మాధ్యమాలను విస్తృతంగా వినియోగిస్తున్నారని, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ తదితర సామాజిక మాధ్యమాల్లో వ్యక్తిగత సమాచారం,
కుటుంబ వివరాలు, ఫొటోలు,ఆర్థిక వివరాలు వంటి సున్నితమైన సమాచారాన్ని బహిరంగంగా పంచుకోవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యక్తుల వివరాలను సేకరించి మోసాలకు పాల్పడుతున్నారని తెలిపారు.
ప్రజలకు సైబర్ నేరాలపై అవగాహన కల్పించడంతో పాటు, తల్లిదండ్రులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని విద్యార్థులకు సూచించారు. రైతుల నమోదు, యూరియా యాప్ డౌన్‌లోడ్ తదితర పేర్లతో ఎవరైనా ఫోన్ చేసి ఒకసారి ఉపయోగించే సంకేత సంఖ్య (OTP), బ్యాంకు వివరాలు లేదా ఇతర వ్యక్తిగత సమాచారాన్ని అడిగితే అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనూ OTP, పిన్, పాస్‌వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోవద్దని సూచించారు.
అనుమానాస్పద ఫోన్ కాల్స్, సందేశాలు,లింకులు లేదా అనువర్తనాల విషయంలో తొందరపడి స్పందించకుండా “Pause. Think. Verify.” అనే విధానాన్ని పాటించాలని సూచించారు. తెలియని లింకులపై క్లిక్ చేయకుండా, అనుమానాస్పద అనువర్తనాలను డౌన్‌లోడ్ చేయకుండా జాగ్రత్త వహించాలన్నారు.
సైబర్ నేరగాళ్లు అమాయకులను లక్ష్యంగా చేసుకుని ఆర్థిక మోసాలకు పాల్పడటమే కాకుండా ఇతర విధాలుగా కూడా ఇబ్బందులకు గురిచేసే అవకాశం ఉందని తెలిపారు. సైబర్ మోసానికి గురైన వెంటనే లేదా అనుమానాస్పద లావాదేవీ జరిగినట్లు గుర్తించిన వెంటనే జాతీయ సైబర్ నేరాల సహాయవాణి 1930కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని సూచించారు.
సైబర్ నేరాలను అరికట్టడంలో పోలీసుల చర్యలతో పాటు ప్రజల అప్రమత్తత, సహకారం కూడా ఎంతో కీలకమని పోలీస్ కమిషనర్ పేర్కొన్నారు. విద్యార్థులు తాము సైబర్ భద్రతా జాగ్రత్తలు పాటించడంతో పాటు,తమ తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, స్నేహితులకు కూడా సైబర్ భద్రతపై అవగాహన కల్పించాలని సూచించారు.
జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసం కార్యక్రమాల్లో భాగంగా “PAUSE FOR SAFETY – Pause. Think. Verify.” అనే నినాదంతో రూపొందించిన సైబర్ భద్రత అవగాహన పోస్టర్‌ను పోలీసు అధికారులతో కలిసి పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల ఏసీపీ ఆర్.ప్రకాష్, సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ ఏసీపీ డి. వి రంగారెడ్డి, మంచిర్యాల పట్టణ ఇన్‌స్పెక్టర్ ప్రమోదరావు, రామగుండం సైబర్ క్రైమ్ ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్,సైబర్ క్రైమ్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.