ఓటు హక్కును హరిస్తే ప్రజాస్వామ్యమే ప్రమాదంలో పడుతుంది..
దేశప్రజల గొంతుక రాహుల్ గాంధీని అరెస్ట్ చేయడం సిగ్గుచేటు
హనుమకొండ, అక్టోబర్ 7(విజయ క్రాంతి):ప్రజాస్వామ్య వ్యవస్థలో(Democratic system) ఓటు హక్కును కూడా హరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, ఇది ప్రజాస్వామ్యానికి అత్యంత ప్రమాదకరమని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి(MLA Nayini Rajender Reddy) ఆరోపించారు.
ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని డిమాండ్ చేస్తూ పార్లమెంట్ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన నిరసనపై ఢిల్లీలో పోలీసులు అరెస్ట్ చర్యలను నిరసిస్తూ హనుమకొండ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు ఇనగాల వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తో కలిసి పాల్గొన్నారు.
హనుమకొండ డీసీసీ కార్యాలయం నుంచి అశోక్ జంక్షన్ వరకు కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిష్టిబొమ్మను దహనం చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాయిని మాట్లాడుతూ అంబేద్కర్ రచించిన రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును కూడా కాపాడుకోలేని పరిస్థితి రావడం దురదృష్టకరం.
ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు, ఓటర్ల జాబితాలో పేర్ల తొలగింపుపై రాహుల్ గాంధీ మొదటి నుంచీ ప్రశ్నిస్తున్నారు అని అన్నారు.బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశంలోని ప్రజా సంస్థలను బలోపేతం చేయడం కంటే వాటిని నిర్వీర్యం చేస్తోందని ఆయన విమర్శించారు. పేద విద్యార్థులు కష్టపడి చదివి ఉద్యోగాలు సాధించాలనుకుంటే పేపర్ లీకేజీలతో వారి భవిష్యత్తును దెబ్బతీస్తున్నారని ఆరోపించారు.
రాహుల్ గాంధీ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం నిరసన చేస్తుంటే ఆయనను, ఇతర ప్రతిపక్ష నాయకులను పోలీసులు అదుపులోకి తీసుకోవడం సరైన పద్ధతి కాదన్నారు. అక్టోబర్ 6న ఢిల్లీలో రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సహా పలువురు ప్రతిపక్ష నేతలను పోలీసులు అదుపులోకి తీసుకోవడం పట్ల మండిపడ్డారు.ఇది కేవలం ఒక పార్టీకి సంబంధించిన సమస్య కాదు.
ఓటు హక్కు, రాజ్యాంగం, ప్రజాస్వామ్య సంస్థల పరిరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత. మేధావులు, విద్యార్థులు, ప్రజాస్వామ్యవాదులు ఈ అంశాలపై ఆలోచించి ప్రజాస్వామ్య పరిరక్షణలో భాగస్వాములు కావాలి అని ఎమ్మెల్యే నాయిని పిలుపునిచ్చారు.