ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలి
ఆసిఫాబాద్, అక్టోబర్ 7 (విజయక్రాంతి): కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులను మోసం చేస్తోందని టీఎంయూ రాష్ట్ర అధ్యక్షుడు ఏఆర్ రెడ్డి(TMU State President AR Reddy) ఆరోపించారు. బుధవారం ఆసిఫాబాద్ ఆర్టీసీ డిపోలో ఐక్య కూటమి ఆధ్వర్యంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామన్న హామీని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు.
పెండింగ్‌లో ఉన్న కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అక్టోబర్ 9న జరిగే ఎన్నికల్లో ఎంప్లాయీస్ యూనియన్‌కు బస్సు గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బోగె ఉపేందర్, జిల్లా అధ్యక్షుడు టి. దివాకర్, నాయకులు కోదురుపాక మహేశ్, మల్లికార్జున్, అశోక్, ఆర్‌పీ సింగ్ తదితరులు పాల్గొన్నారు.