అటవీ సంపదను కాపాడేందుకు సమన్వయంతో పనిచేయాలి

13-11-2026 | 03:08pm

జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు

ములుగు, నవంబర్ 13 (విజయక్రాంతి): అడవులను సంరక్షించడం(Conserving forests) ద్వారానే పర్యావరణ సమతుల్యతను కాపాడగలమని జిల్లా కలెక్టర్ బొర్ఖడే హేమంత్ సహదేవరావు(District Collector Borkhade Hemant Sahadeorao) అన్నారు. అటవీ సంపదను(forest wealth) రక్షించేందుకు సంబంధిత శాఖలన్నీ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

శుక్రవారం జిల్లా సమీకృత కలెక్టరేట్ సమావేశ మందిరంలో అటవీ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి అటవీ పరిరక్షణ కమిటీ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ బోర్ఖడే హేమంత్ సహదేవరావు అధ్యక్షతన జిల్లా అటవీ అధికారి వికాస్ మీనా, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్, ఐటీడీఏ పీఓ లెనిన్ వత్సల్ టోప్పోలతో కలిసి నిర్వహించారు.

అడవులు వాతావరణ మార్పులను తగ్గించడంలో, జీవవైవిధ్యం మరియు జల వనరులను సంరక్షించడంలో, భూమి కోతను నివారించడంలో సహాయపడతాయని కలెక్టర్ పేర్కొన్నారు. అటవీ భూముల ఆక్రమణ, అక్రమంగా చెట్ల నరికివేత, కలప అక్రమ రవాణాపై రెవెన్యూ, అటవీ, పోలీస్ శాఖలు సంయుక్త చర్యలు తీసుకోవాలని, అటవీ పరిసర గ్రామాల్లో అటవీ చట్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని,

నిబంధనల ప్రకారం ఉల్లంఘనదారులపై తక్షణ చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు. జిల్లా భౌగోళిక విస్తీర్ణంలో 72 శాతం కంటే ఎక్కువగా అడవులు, చెట్ల విస్తీర్ణం ఉందని జిల్లా అటవీ అధికారి తెలిపారు. వన్యప్రాణుల వేట, ఉచ్చులు, కలప మరియు ఇసుక అక్రమ రవాణాపై మరింత కఠిన నిఘా ఉంచాలని, అటవీ అగ్నిప్రమాదాలను నివారించడానికి క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాలని ఆయన అన్నారు.

గిరిజన సంఘాల హక్కులను గౌరవిస్తూనే, గుత్తికోయ ఆవాసాల చుట్టూ కొత్తగా పోడు వ్యవసాయం జరగకుండా నిరోధించాలని, ఆక్రమణలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మరియు పోలీసులతో కలిసి సంయుక్త గస్తీ నిర్వహించాలని ఆయన అధికారులను కోరారు. అటవీ సంరక్షణకు పూర్తి సహకారం అందించాలని పోలీసు అధికారులందరికీ ఆదేశాలు జారీ చేసినట్లు పోలీస్ సూపరింటెండెంట్ తెలిపారు. ఈ సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ మనన్ భట్, పోలీస్, అటవీశాఖ అధికారులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు