హైవే హోటళ్లలో ‘ఫుడ్’ కలకలం
*కిచెన్లలో అపరిశుభ్రత.. బొద్దింకలు, బల్లుల సంచారం
*కుళ్లిన ఆహార పదార్థాలు.. ఫ్రిజ్‌లలో అస్తవ్యస్తంగా మాంసం
*ఓ హోటల్ సీజ్.. మరికొన్నింటికి నోటీసులు
భిక్కనూర్, అక్టోబర్ 6 (విజయక్రాంతి): హైవేపై ప్రయాణం.. ఆకలి వేస్తే కనిపించిన హోటల్‌లో భోజనం.. ఇదే ప్రయాణికుల సాధారణ పరిస్థితి. కానీ ఆహారం తయారయ్యే కిచెన్‌లో పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుంటే మాత్రం షాక్ అవ్వాల్సిందే. భిక్కనూర్ పరిధిలో మంగళవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు నిర్వహించిన తనిఖీల్లో హోటళ్లు, రెస్టారెంట్ల(Hotels and Restaurants)లోని అపరిశుభ్రత వెలుగులోకి వచ్చింది.
హైదరాబాద్ నుంచి వచ్చిన ప్రత్యేక ఫుడ్ సేఫ్టీ బృందం మెదక్ జిల్లా రామాయంపేట నుంచి కామారెడ్డి జిల్లా పరిధి వరకు 44వ జాతీయ రహదారిపై ఉన్న పలు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు చేపట్టింది. కిచెన్లలో పేరుకుపోయిన మురికి, ఆహార పదార్థాలపై తిరుగుతున్న బొద్దింకలు, బల్లులు, కంపు వాసన, శుభ్రత లేకపోవడం వంటి పరిస్థితులను అధికారులు గుర్తించారు. కొన్ని చోట్ల పాడైపోయిన, కాలం చెల్లిన ఆహార పదార్థాలను కూడా గుర్తించి వాటి నమూనాలను సేకరించారు.
**ఫ్రిజ్‌లో మాంసం.. నిల్వలో నిర్లక్ష్యం
కొన్ని హోటళ్లలో ఫ్రిజ్‌లలో చికెన్, మటన్, చేపలను అస్తవ్యస్తంగా నిల్వ ఉంచినట్లు అధికారులు గుర్తించారు. ఆహార పదార్థాలను నిల్వ చేసే విధానం, వంటగది పరిశుభ్రత, పరిసరాల నిర్వహణలో నిబంధనలు పాటించడం లేదని గుర్తించారు. ఉల్లి, వెల్లుల్లి తదితర నిత్యావసర వస్తువులతో పాటు అనుమానాస్పదంగా ఉన్న ఆహార పదార్థాల నమూనాలను సేకరించి పరీక్షలకు పంపించారు.
**ఓ హోటల్ సీజ్
భిక్కనూర్ మండల పరిధిలోని హైవే పక్కన ఉన్న ఓ హోటల్ కిచెన్ అధ్వానంగా ఉండటంతో అధికారులు సీరియస్‌గా స్పందించారు. నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి హోటల్‌ను సీజ్ చేశారు. కిచెన్‌ను పూర్తిగా శుభ్రపరిచి, పరిశుభ్రమైన వాతావరణం కల్పించే వరకు హోటల్ నిర్వహణకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. కస్టమర్లకు అక్కడి ఆహారాన్ని అందించవద్దని సూచించి, హోటల్‌ను మూసివేశారు.
**‘నాణ్యమైన ఆహారం ఇవ్వాలి’
ఇతర హోటళ్లు, రెస్టారెంట్ల నిర్వాహకులకు కూడా అధికారులు నోటీసులు జారీ చేసి నిబంధనలు పాటించాలని సూచించారు. కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సందర్భంగా ఫుడ్ సేఫ్టీ అధికారి అరవింద్‌రెడ్డి మాట్లాడుతూ కిచెన్‌ను పూర్తిగా పరిశుభ్రంగా మార్చే వరకు సీజ్ చేసిన హోటల్‌ను తెరవడానికి అనుమతి ఉండదని తెలిపారు.
**తనిఖీలతో అయినా మారుతారా?
హైవేపై నిత్యం వేలాది మంది ప్రయాణికులు హోటళ్లలో భోజనం చేస్తుంటారు. ప్రయాణికుల ఆకలి తీర్చాల్సిన హోటళ్లు.. వారి ఆరోగ్యానికి ముప్పుగా మారకూడదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. తాజా తనిఖీల్లో బయటపడిన పరిస్థితుల నేపథ్యంలో హోటళ్లు, రెస్టారెంట్లు, మిఠాయి దుకాణాలు, బేకరీల నిర్వాహకులు ఇకనైనా పరిశుభ్రత, నాణ్యత ప్రమాణాలను పాటిస్తారా? లేక అధికారులు మళ్లీ తనిఖీలు చేసే వరకు ఇదే పరిస్థితి కొనసాగుతుందా? అనేది వేచి చూడాల్సిందే.