గౌడ కులస్తులపై నార్కోటిక్ అధికారుల వేధింపులు ఆపాలి
దాడులు ఆపకపోతే కల్లు దుకాణాలను మూసివేస్తాం
జై గౌడ ఉద్యమం కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ డిమాండ్
కామారెడ్డి, నవంబర్ 10 (విజయక్రాంతి): గౌడ కులస్తులను లక్ష్యంగా చేసుకుని నార్కోటిక్ అధికారులు కల్లు దుకాణాలపై దాడులు నిర్వహిస్తూ ఇబ్బందులకు గురిచేయడం సరికాదని జై గౌడ ఉద్యమం(Jai Gowda Movement) కామారెడ్డి జిల్లా అధ్యక్షుడు రంగోల్ల మురళీ గౌడ్ అన్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కల్లు దుకాణాల వద్ద అధికారుల దాడుల పేరుతో గౌడ కులస్తులను భయభ్రాంతులకు గురిచేయడం, వారి జీవనోపాధికి ఆటంకం కలిగించడం తగదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
సంప్రదాయంగా కల్లు వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న గౌడ కుటుంబాల పట్ల అధికారులు బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. చట్టవిరుద్ధ కార్యకలాపాలు జరిగితే చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని, అయితే వృత్తిని నమ్ముకుని జీవిస్తున్న గౌడ కులస్తులను అనవసరంగా వేధించకూడదని స్పష్టం చేశారు.కల్లు దుకాణాలపై అనవసర దాడులు, వేధింపులు వెంటనే నిలిపివేయాలని, లేనిపక్షంలో గౌడ కులస్తుల జీవనోపాధిని కాపాడుకునేందుకు కల్లు దుకాణాలను మూసివేసి నిరసన కార్యక్రమాలకు దిగుతామని హెచ్చరించారు.
ఈ విషయంపై ప్రభుత్వం, సంబంధిత ఉన్నతాధికారులు వెంటనే స్పందించి గౌడ కులస్తులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. గౌడ కులస్తుల ఆత్మగౌరవం, సంప్రదాయ వృత్తి, జీవనోపాధి పరిరక్షణ కోసం జై గౌడ ఉద్యమం నిరంతరం పోరాటం చేస్తుందని రంగోల్ల మురళీ గౌడ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జై గౌడ ఉద్యమం జిల్లా ప్రధాన కార్యదర్శి అంకన్న గారి శ్రీనివాస్ గౌడ్, మొగుళ్ల రామా గౌడ్, ఇందూరి సిద్ధా గౌడ్, బొంబోతుల సురేష్ గౌడ్, అధికం నర్సాగౌడ్,కామారెడ్డి నరేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.